పటాన్చెరు/పటాన్చెరు రూరల్, ఏప్రిల్ 17: జాతీయ అగ్నిప్రమాదాల భద్రతా వారోత్సవాల వేళ పాశమైలారంలోని ఓ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం వెంకర్ కెమికల్స్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్లాంట్ మొత్తం వ్యాప్తి చెందగా స్పందించిన ఇరుగుపొరుగు పరిశ్రమల యాజమాన్యాలు మంటలు ఇతర పరిశ్రమలకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో ఫస్ట్ షిఫ్ట్‌కు వచ్చిన 40మంది కార్మికులు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. టిఫిన్ చేయడానికి బయటకు వచ్చారు. నలుగురు మాత్రమే పరిశ్రమలో ఉన్నారు.
సాల్వెంట్స్ డ్రమ్స్ నిలువ ఉన్నచోట సాల్వెంట్స్ వికటించి నిప్పురవ్వలు ఎగిశాయి. దీంతో చూస్తుండగానే అగ్నిరాజుకున్నది. డ్రమ్ములు పేలిపోతుండటంతో శబ్దాలతో కార్మికులు పరుగులు తీశారు. అధికశాతం మంది గేటు బయటే ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అగ్ని ప్లాంట్ మొత్తం వ్యాపిస్తుండటం గమనించిన పక్కనే ఉన్న అరబిందో ఫార్మా , శ్రీకర పరిశ్రమల భద్రత బృందం, ఐలా భద్రత బృందాలు వెంకర్లోకి వచ్చి అగ్ని విస్తరించకుండా నిలువరించారు. అంతలో ఐలా ఫైరింజన్లు రెండు రావడంతో ఫోమ్ వెదజల్లి మంటలను అదుపులో ఉంచారు.
పటాన్చెరు నుంచి, సంగారెడ్డి నుంచి ఫైరింజన్లు రావడంతో మంటలను పూర్తిస్థాయిలో ఆర్పేశారు. పరిశ్రమలో ఫైర్సేఫ్టి సరిగ్గా లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తున్నది. భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఆస్తినష్టం వివరాలు పరిశ్రమ యాజమాన్యం వెల్లడించలేదు. వెంకర్లో అగ్ని ప్రమాదం అని తెలియగానే కార్మికుల కుటుంబాల్లో టెన్షన్ నెలకొంది. కార్మికులకు, పరిశ్రమ సిబ్బందికి ఫోన్లు చేసి అందరూ క్షేమం అని తెలుసుకొని కార్మికుల కుటుంబాలు రిలీఫ్ అయ్యాయి. వెంకర్ పరిశ్రమను బీడీఎల్ సీఐ స్వామిగౌడ్ సందర్శించి అగ్నిప్రమాదం వివరాలు సేకరించారు.