సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 25: కలెక్టరేట్ మొదటి అంతస్తులోని ముఖ్య ప్రణాళిక అధికారి (సీపీవో) కార్యాలయంలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రమాద స్థలాన్ని పరిశీలించి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ట్రాన్స్కో, అగ్నిమాపక శాఖలను కలెక్టర్ ఆదేశించారు. అగ్ని ప్రమాద ఘటనలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి, అవరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రమాద ఘటనకు సంబంధించి అందుబాటులో ఉన్న అన్ని ఆధారాలను సేకరించి ప్రమాదం వెనుక ఉన్న కారణాలను కచ్చితంగా నిర్ధారించాలని అగ్ని మాపక శాఖ అధికారులను ఆదేశించారు. సీపీవో కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో కలెక్టరేట్లో ఆందోళనకర పరిస్థితి నెలకొన్నది. దీంతో కలెక్టరేట్లోని అన్ని కార్యాలయాల భద్రతాప్రమాణాలను పున:సమీక్షించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆయా శాఖల కార్యాలయాల్లో ఉన్న ఫైర్ సేఫ్టీ పరికరాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనే విషయాలను పరిశీలించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
కలెక్టరేట్లోని సీపీవో కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కలెక్టర్ వల్లూరు క్రాంతి అగ్ని ప్రమాదం జరిగిన కార్యాలయాన్ని పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఇందుకు సంబంధిత శాఖ అధికారులు స్పందిస్తూ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు వివరించారు. ప్రమాదం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.