బొల్లారం, మే 6: సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్లోకెమ్ పరిశ్రమలోని ఒక బ్లాక్లో ఉదయం హఠాత్తుగా మంటలు చెలరేగడంతో కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో దట్టమైన నల్లనిపొగ అలుముకున్నది. అప్రమత్తమైన పరిశ్రమ యాజమాన్యం సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
సుమారు గంటపాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడికి గాయాలుకాగా యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా దవాఖానకు తరలించింది. ఘటనపై పోలీసులను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్ప డం గమనార్హం. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెద్దప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆస్తినష్టంపై అంచనా వేసి ప్రమాదానికి గల కారణాలను పోలీసుల విచారణ అనంతరం తెలిసే అవకాశం ఉంది.