ప్రతి గుంటకూ సాగు నీరందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రామాయంపేట మండలం డి.ధర్మారంలో రూ. 3.5ం కోట్లతో నిర్మించిన ఫంక్షన్‌హాల్, మనఊరు-మనబడి కింద రూ.75లక్షలతో నిర్మించిన పాఠశాల భవనాలను మంత్రి ప్రారంభించారు. చేగుంట మండలం బోనాల్ గ్రామం వద్ద కొండపోచమ్మ కెనాల్ ద్వారా వచ్చిన కాళేశ్వరం జలాలకు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ కలెక్టర్ రాజర్షి షాతో కలిసి పూజలు చేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ హయాంలో రైతులు ఎరువుల కొరత, కరెంట్ కోతలు, సాగునీటికి ఇబ్బందులు పడ్డారని, నేడు సీఎం కేసీఆర్ హయాంలో ఇరవై నాలుగుగంటల ఉచిత విద్యుత్‌తో పాటు సరిపడా ఎరువులు ఉంచుతున్నామన్నారు. వేల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం జలాలు తీసుకువచ్చి మండుటెండల్లోనూ సాగునీరందిస్తున్నామన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.
– రామాయంపేట/ నిజాంపేట/ చేగుంట, ఫిబ్రవరి 19
రామాయంపేట, నిజాంపేట 19: ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ప్రతి గుంటకూ నీరివ్వడమే లక్ష్యంగా చేసుకున్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా రామాయంపేట మండంలోని డి.ధర్మారంలో ఫంక్షన్‌హాల్, ‘మనఊరు-మనబడి’ పనులను పూర్తి చేసుకున్న పాఠశాల భవనాలను ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతంరం అక్కడి నుంచి రూ.1.50 కోట్లతో నూతనంగా మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ డి.ధర్మారం గ్రామానికి చెందిన సీఎం కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి తన ఊరును మర్చిపోకుండా తనవంతుగా గ్రామంలో రూ.3.50 కోట్లతో ఫంక్షన్‌హాల్, ‘మనఊరు-మనబడి’లో భాగమై రూ.75 లక్షలతో పాఠశాల భవనాన్ని నిర్మించారని కొనియాడారు.
గ్రామంలోని మహిళల కోసం రూ.20 లక్షలతో మహిళా భవనానికి నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం నిజాంపేట మండలం నార్లాపూర్ శివారులోని హైదర్ చెరువులోకి గజ్వేల్ నుంచి వస్తున్న రామాయంపేట కెనాల్ ద్వారా వచ్చే కాలేశ్వరం నీటిని కుంకుమ, పసుపు, గంగ హారతి చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఒక్కరోజుకు రూ.30 కోట్లు వెచ్చించి రైతుల కోసం వ్యవసాయానికి నిరంతరాయంగా ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నారన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆయన చేస్తున్న పనులు అడ్డుకునేందుకు మోటరక్లు మీటర్లను బిగిస్తే రూ.30 వేల కోట్లు నజరానాను రాష్ర్టానికి ఇస్తానని మభ్యపెడుతున్నదని విమర్శించారు. రైతులకు ఇబ్బందులు కలుగవద్దని విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా మేడిగడ్డ నుంచి సుమారు కాళేశ్వర జలాలను రామాయంపేటకు తీసుకురావడం గొప్ప విషయమన్నారు. మండుటెండల్లో కాళేశ్వరం జలాలతో చెరువులు, కుంటలు మత్తడ్లు దుంకి రెండు పంటలూ పండించుకునేలా సాగునీరు అందుతున్నదన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం క్యూలైన్లో నిలబడి చివరికి వట్టి చేతులతోనే వెళ్లే వారన్నారు. నేడు తమ ఇంటికే మా దేవన్న లారీలు, ట్రాక్టర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారన్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వాలు కాంగ్రెస్, బీజేపీలు వ్యవహరిస్తున్నాయన్నారు.
కార్యక్రమంలో మెదక్ కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, రెండు మండలాల ఎంపీపీలు దేశెట్టి సిద్దిరాములు, నార్సింపేట భిక్షపతి, ఎంపీడీవో ఉమాదేవి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు మహేందర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, వైస్ చైర్మన్లు ముస్కుల స్రవంతి, ఇందిర, పీఏసీఎస్ చైర్మన్లు బాదె చంద్రం, బాపురెడ్డి, అందె కొండల్‌రెడ్డి, సర్పంచ్‌లు రావిపల్లి అమరసేనారెడ్డి, అనూష, బొడ్డు శంకర్, చంద్రవర్ధిని, మాజీ ఎంపీపీ బిజ్జ సంపత్, సంగు స్వామి, మావురం రాజు తదితరులున్నారు.
మెదక్ ప్రజల కోరిక తీరింది : ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
మెదక్ ప్రాంత ప్రజల చిరకాల కోరిక కాళేశ్వరం జలాల ద్వారా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. రామాయంపేట, నిజాంపేట మండలంలోని ప్రజలు అప్పటి ప్రభుత్వాల తీరుతో ఇబ్బందులకు గురయ్యారని, ఇప్పుడు సీఎం కేసీఆర్ చలవతో నీటి సమస్య తీరిందని అన్నారు. ఈ ప్రాంత ప్రజలు బీఆర్ఎస్ వెన్నంటే ఉండాలని కోరారు.
కల సాకారమైంది : మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
నిజాంపేట మండలానికి కాళేశ్వరం జలాలు రావడంతో నా కల సాకారమైందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. నార్లాపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ డి.ధర్మారంలో ప్రభుత్వ సలహాదారు రాజశేఖర్‌రెడ్డి తన గ్రామాన్ని అభివృద్ధి పర్చడానికే ప్రత్యేకంగా ప్రణాళికలు తయారు చేశారన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి, ఎమ్మెల్యేల ద్వారా గ్రామ రుణం తీర్చుకున్నా : సీఎం కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి వారి కృషితోనే నా కల సాకారమైందని సీఎం కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. డి.ధర్మారం ఫంక్షన్‌హాల్ ప్రారంభానంతరం ఆయన మాట్లాడారు. గ్రామం సుభిక్షంగా ఉండాలనే పనులను చేపట్టానన్నారు.