మెదక్, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ): జిల్లాలోని ఆయా రేషన్ షాపులకు సరఫరా చేస్తున్న సన్న బియ్యంలో నూకలు ఎక్కువగా వస్తున్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. నాణ్యతతో కూడిన సన్న బియ్యం సరఫరా చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రేషన్ దుకాణాల్లో 25శాతానికి మించి నూకలు ఉండడం, వండితే అన్నం ముద్దగా అవుతుందని మహిళలు వాపోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేషన్ దుకాణాలకు సరఫరా చేసే బియ్యంలో నూకలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు పంపిణీ చేస్తున్న సన్నబియ్యంలో నూకల శాతం పెరగడంతో లబ్ధిదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
పంద్రాగస్టు రోజు ఎంపిక చేసిన గ్రామాల్లో రేషన్ కార్డులు పంపిణీ చేసి మురిపించారు. ఆ తర్వాత కొత్త రేషన్ కార్డుల ఊసే ఎత్తడం లేదు. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం పలుమార్లు పౌర సరఫరాల శాఖక దరఖాస్తులు స్వీకరించినా ఎలాంటి ప్రయోజనం లేదు. కొత్తగా పెండ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చినవారి పేర్లు, పిల్లల పేర్లు చేర్చాల్సి ఉంది. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తు చేసుకున్నవారు కార్డుల్లో పేర్లు నమోదు కాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు.
మెదక్ జిల్లాలో 520 రేషన్ దుకాణాలు ఉండగా, 2,13,828 రేషన్ కార్డులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 6,96,043 మంది లబ్ధిదారులు ఉండగా, ప్రతినెలా 4,430.496 మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్ దుకాణాలకు సరఫరా అవుతోంది. జిల్లాలో 22,589 మంది కొత్తగా రేషన్ కార్డుల్లో పేర్ల నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు. 1,369 మంది కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు.
వీటిపై పట్టణాలు, గ్రామాల్లో విచారణ జరుగుతోంది. కులగణన సర్వేలో భాగంగా జిల్లాలో 11,515 మంది దరఖాస్తులు చేసుకోగా, అందులో 405 రేషన్ కార్డులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ సర్కార్ సన్న బియ్యం సరఫరా చేస్తుంది సరే కొత్త రేషన్ కార్డుల మాటేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పలు రేషన్ షాపుల్లో సన్నబియ్యం లేక నో స్టాకు బోర్డులు దర్శనమిస్తున్నాయి. పలుచోట్ల సన్నబియ్యం పంపిణీ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ప్రభు త్వం సన్నబియ్యం పంపిణీ పక్కాగా అమలు చేయాలని వారు కోరుతున్నారు.