మెదక్, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో ప్రైవేట్ దవాఖానల్లో ఫీజు జులుం నడుస్తున్నది. వైద్యం కోసం దవాఖానకు వెళ్తే జేబు గుల్ల అవుతున్నది అనే ఆరోపణలు ఇటీవల బాగా వినిపిస్తున్నాయి. మెదక్ జిల్లాలో 129 ప్రైవేట్ దవాఖానలు, 49 డయాగ్నోస్టిక్ సెంటర్లు, 56 స్కానింగ్ సెంట ర్లు ఉన్నాయి. వివిధ అనారోగ్య సమస్యలతో దవాఖానలకు వెళ్లిన రోగులకు అవసరం లేకున్నా పరీక్షల పేరుతో వసూలు చేస్తున్నారనే ఆరోపణలు రోగుల నుంచి వినిపిస్తున్నాయి.
దవాఖానలకు అనుగుణంగానే ల్యాబ్‌లు, మెడికల్ షాపులు ఏర్పాటు చేసుకున్నారు. సీజనల్ వ్యాధుల సమయంలో చేస్తున్న దోపిడీపై చెప్పనవసరం లేదు. వచ్చిన రోగం తగ్గుతుందని ప్రైవేట్ దవాఖానలకు వస్తే జేబులో డబ్బులు ఖాళీ అవుతున్నాయి. చిన్నపాటి రో గం వచ్చి ప్రైవేట్ దవాఖానలకు వెళ్తే రక్త పరీక్షలు, స్కానింగ్‌లు, ఎక్స్‌రేలు అంటూ రోగిని బెంబేలెత్తించి రూ.వేలల్లో బిల్లులు వేస్తూ వారి జేబుకు చిల్లులు వేస్తున్నారు. మెదక్ జిల్లాలో వైద్యం పూర్తి వ్యాపారంగా మారింది. మల్టీస్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ దవాఖానల పేర్లతో జిల్లాలోని మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట, చేగుంట, పెద్దశంకరంపేట మండలాల్లో అనేకం పుట్టుకొచ్చాయి.
వీటిలో వారంలో ఒక రోజు ప్రత్యేక వైద్యులు వస్తారంటూ ప్యాకేజీల పేరుతో ఆర్ఎంపీలు, పీఎంపీలతో కొత్త పంథాకు తెరలేపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి రోగులను ప్రైవేట్ దవాఖానలకు రెఫర్ చేస్తే వారికి కమీషన్లు ఇస్తూ రోగుల నుంచి రూ.వేలల్లో బిల్లులు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో బిల్లులు వసూలు చేస్తున్నారు కానీ, మెరుగైన వైద్య సేవలు, కనీస నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. చాలా దవాఖానల్లో చికిత్సలకు సంబంధించిన ధరల పట్టికలు సైతం ఏర్పాటు చేయలేదు. దవాఖానలపై పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రైవేట్ దవాఖానకు వెళ్లాలంటే సామాన్యులు జంకుతున్నారు. కొన్ని దవాఖానల్లో డబ్బులు గుంజడమే లక్ష్యంగా పెట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మెదక్ జిల్లాలో చిన్న పిల్లల వైద్యం నుంచి మొదలు స్త్రీ, శిశు, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, సర్జన్లు, ఆర్థో, న్యూరో, గుండె, రేడియాలజిస్టులు, నెఫ్రాలజీ, ఈఎన్టీలు, ఫర్టిలిటీ తదితర వైద్య సేవలు అందించేందుకు మల్టీ స్పెషాలిటీ దవాఖానలు వెలిశాయి. కొన్ని చోట్ల అధికంగా మందులు రోగులకు అంటగట్టడం, పరీక్షల పేరుతో డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు వైద్యులకు తమ డయాగ్నోసిస్ కేంద్రాలకు పంపితే కమీషన్లు ఇస్తామంటూ ఎర వేయడంతో అక్కడికి టెస్టులకు రెఫర్ చేస్తున్నారు.
కొందరు ప్రైవేట్ దవాఖానల యాజమాన్యాలు ధనాపేక్ష ధ్యేయంగా వైద్య వ్యాపారం సాగిస్తున్నారు. రూ.కోట్లలో పెట్టుబడులు పెడుతూ అంతకు రెట్టింపు సం పాదించే ప్రయత్నం చేస్తున్నారు.ఈ క్రమంలో వైద్యులకు నెలకు ఇంత అని బిజినెస్ టార్గెట్ పెడుతున్నట్లు తెలిసింది. కార్పొరేట్ వైద్యం పేరుతో పేద, మధ్య తరగతి ప్రజల బలహీనతను సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. ఎప్పటికప్పుడు ప్రైవేట్ దవాఖానలపై నిఘా ఉంచాల్సిన వైద్యారోగ్య శాఖ పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ వైద్యం అదుపు తప్పుతోంది. ఫిర్యాదు వస్తే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. తనిఖీలు, పరిశీలనలు లేకపోవడంతో ఇష్టారీతిన సాగుతోంది. ఈ క్రమంలో ప్రైవేట్ దవాఖానల పనితీరు, చికిత్స, అధిక బిల్లులు తదితర అంశాలపై జిల్లావైద్య ఆరోగ్యశాఖ, కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్ దవాఖానలు, ల్యాబ్‌ల్లో కచ్చితంగా ఫీజుల బోర్డులను ఏర్పాటు చేయాలి. ఏ చికిత్సకు ఎంత తీసుకుంటున్నారో బోర్డులో తెలపాలి. జిల్లాలో కొన్ని దవాఖానల్లో మాత్రమే నార్మల్ డెలివరీ, సిజేరియన్ ఇతరత్రా వాటికి ఎంత ఫీజులు వసూలు చేస్తారో బోర్డులు ఉన్నాయి. మిగతా దవాఖానల్లో ఆ బోర్డులు ఎక్కడా కనిపించడం లేదు. ఓపీ ఫీజు కూడా రూ.300 నుంచి 800 వరకు వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా వైద్యారోగ్య శాఖ అధికారులు తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. ప్రైవేట్ దవాఖానల్లో కచ్చితంగా ఫీజుల బోర్డులు ఏర్పాటు చేయాలి. డిప్యూటీ డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో దవాఖానలకు తనిఖీ చేస్తున్నాం.
– డాక్టర్ శ్రీరాం, డీఎంహెచ్‌వో మెదక్