గజ్వేల్, మే 30: రాష్ట్రంలో ప్రజాపాలన కాకుండా రాక్షస పాలన నడుస్తోందని, ఎంతసేపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమంపై బురద చల్లడం తప్ప ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులకు దశాబ్ది ఉత్సవాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం వారితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర చిహ్నాల్లోని కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తులను తొలిగిస్తామనడం సిగ్గుచేటన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిందలు మోపడానికి చిహ్నాలను తొలిగించడానికే సమయాన్ని వృథా చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ చిహ్నాల్లో మార్పు ప్రజాపాలనలో తప్పులకు నిదర్శమన్నారు. వ్యవసాయం, నీళ్లకు కాకతీయ కళాతోరణం, వైద్య సంక్షేమానికి చార్మినార్ గుర్తులని చెప్పారు. తెలంగాణ రాజముద్రను మార్చడం తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టడమే అన్నారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదన్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలని హితువు పలికారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజావ్యతిరేక దిశగా అడుగులు వేస్తున్నదని వంటేరు ప్రతాప్‌రెడ్డి మండిపడ్డారు.
ఉమ్మడి రాష్ట్ర పాలనలో విధ్వంసానికి గురైన అనేక రంగాలు కేసీఆర్ హయాంలో పునర్జీవనం దిశగా అడుగులు పడితే, వాటిని ఛిద్రం చేసే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నదన్నారు. దమ్ముంటే రాజకీయాలను రాజకీయంగా ఎదుర్కోవాలని, చిహ్నాలను తొలిగించడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. ఆంధ్ర నాయకులకు వత్తాసు పలికే విధంగా రేవంత్ విధానాలు ఉన్నాయన్నారు. కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు దశాబ్ది వేడుకలను గజ్వేల్ నియోజకవర్గంలో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ ఉత్సవాల్లో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయొద్దీన్, పట్టణ పార్టీ అధ్యక్షుడు నవాజ్ మీరా, కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు.