మర్కూక్, మే 19: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, ప్రభుత్వం స్పందించకుంటే వేలాది రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో గౌరారం దగ్గర రాజీవ్ రహదారిని ముట్టడిస్తామని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ మర్కూక్ మండల అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, జడ్పీటీసీ మంగమ్మరాంచంద్రం, వైస్ ఎంపీపీ బాల్‌రెడ్డితో కలిసి మర్కూక్‌లో రైతుల కళ్లాల వద్దకు వెళ్లి ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించిన సన్న, దొడ్డు వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని, క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇవ్వాలని కాంగ్రెస్ సర్కారును డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. కొన్న ధాన్యానికి రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమచేసినట్లు తెలిపారు. కేసీఆర్ హయాంలో గజ్వేల్ నియోజకవర్గంలో కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టులను నిర్మించి రైతులకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్‌కే చెల్లిందన్నారు. అలవికాని హామీలు, అసత్యపు ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతుల సమస్యలను విస్మరించిందన్నారు.
మండలంలో దాదాపు 50 లారీల ధాన్యం రోడ్లపైన ఉందన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దమవుతున్నట్లు తెలిపారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వేగంగా ధాన్యం సేకరణ పూర్తిచేయాలన్నారు. లేకపోతే పెద్దఎత్తున రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేస్తామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. రైతు సంక్షేమానికి కృషిచేసింది బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. ఏ ఒక్క హామీ కాంగ్రెస్ సర్కారు అమలు చేయడం లేదని వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఆయన వెంట ఎంంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కృష్ణయాదవ్, మేకల కనకయ్య, అచ్చంగారి భాస్కర్, సంతోష్‌రెడ్డి, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.