గజ్వేల్/గజ్వేల్ అర్బన్/జగదేవ్‌పూర్/వర్గల్/ములుగు/ మర్కూక్, నవంబర్ 28: గజ్వేల్ ప్రాంతంలో సీఎం కేసీఆర్ చేపట్టిన కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల నిర్మాణంతో కరువు పోయిందని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గజ్వేల్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ రాకతోనే గజ్వేల్‌లో ప్రాజెక్టుల నిర్మాణం, హార్టికల్చర్ విశ్వవిద్యాలయం,అటవీ కళాశాల, రింగ్‌రోడ్డు, కేజీ టూ పీజీ, ఐవోసీ భవనం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, గ్రామ పంచాయతీ భవనాలు, గ్రామాల్లో ఫంక్షన్ హాళ్లు, మహిళా భవనాలు, డ్వాక్రా భవనాలు, డంపింగ్‌యార్డులు, గ్రేవ్ యార్డులు, ఇంటింటికీ తాగునీటి సరఫరా చేసుకున్నామన్నారు. చెరువుల పునరుద్ధరణ చేసుకున్నామని, గోదావరి జలాలతో చెరువులు నిండుగా కనిపిస్తున్నాయన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో కుడవెళ్లి, హల్దీవాగులు జీవనధులుగా మారాయన్నారు. సీఎం కేసీఆర్ ధైర్యవంతుడు కాబట్టే యాగాలు, యజ్ఞాలు చేయడం, యాదాద్రి ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. కేసీఆర్ రాకతోనే పదేండ్లలో కరువు పోయిందని, ఎండాకాలంలో చెరువులు, చెక్‌డ్యామ్‌లు మత్తళ్లు దుంకుతున్నాయన్నారు. తెలంగాణలో అభివృద్ధి కేసీఆర్‌తోనే జరిగిందని, కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి నేడు మోడల్‌గా నిలుస్తుందన్నారు.
రైతు బంధు, రైతుబీమా అమలు చేసి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేసీఆర్ పాలన ఉందన్నారు. కల్యాణలక్ష్మి , షాదీముబారక్ తీసుకురావడంతో ప్రతి పేదకుటుంబానికి మేలు జరుగుతుందన్నారు. కులం, మతం పేరు చెప్పి బీజేపీ, కాంగ్రెస్ ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నాయని, అలాంటి అవకాశం వారికి ఇవ్వొద్దన్నారు. మనసుతో ఆలోచించి ప్రతి ఒక్కరూ తెలంగాణను అభివృద్ధి చేసిన కేసీఆర్‌కే ఓటు వేయాలన్నారు. మనం వేసే ఓటు తెలంగాణ ముఖ్యమంత్రికి వేస్తున్నామని, బీజేపీ, కాంగ్రెస్‌లకు వేస్తే దండుగే అవుతుందన్నారు. అసైన్డ్ భూములు తీసుకోమనే విషయాన్ని ఇక్కడికి వచ్చిన ప్రజలకు చెప్పాలన్నారు. నియోజకవర్గంలోని కొండపోచమ్మ, నాచారం దేవాలయాల అభివృద్ధికి కావాల్సిన నిధులు ఇవ్వాలన్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐటీ టవర్, జగదేవపూర్ మార్కెట్ యార్డు, గజ్వేల్‌కు స్పోర్ట్స్ స్టేడియం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, టెక్స్టైల్ పార్కులు, గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు మంజూరు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి కేసీఆర్‌కు ఓటు వేసి గెలిపించుకోవాలన్నారు. అనంతరం ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ను మూడోసారి గజ్వేల్ ప్రజలు లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు.
పదేండ్ల క్రితం నియోజకవర్గ ప్రజలు రోజూ గొడవలతో పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగే వారని, కేసీఆర్ సీఎం అయ్యాక ప్రజలు ప్రశాంత జీవనం గడుపుతున్నామని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూంరెడ్డి అన్నారు. రైతుల సంక్షేమానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ధరణితో గ్రామాల్లో చాలావరకు భూసమస్యలు దూరమయ్యాయన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెవెన్యూ సమస్యలుపూర్తిగా పరిష్కారం అవుతాయన్నారు. కేసీఆర్ పాలనలో రైతులకు మేలు జరిగిందని, కేసీఆర్ వెన్నంటే ఉండి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.