గుమ్మడిదల,జనవరి 3: మెదక్ జిల్లాలో మెదక్-బాలానగర్ రహదారిపై నల్లవల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.క్షతగాత్రులను సూరారంలోని మల్లారెడ్డి దవాఖానకు తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. జిన్నారం సీఐ నయిమోద్దీన్ వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో నర్సాపూర్ నుంచి స్విప్ట్డిజైర్ కారు (ఏపీ28డీవీ4801), ప్యాసింజర్ ఆటో (టీజీ35టీ 0168) నర్సాపూర్ నుంచి బాలానగర్ జాతీయ రహదారి వైపు బయలుదేరాయి.
గుమ్మడిదల మండలం నల్లవల్లి అటవీ ప్రాంతంలోని మేడాలమ్మ ఆల యం సమీపంలో అతివేగంగా కారు దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న (టీఎస్35 టీఏ 2586) ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టింది. కారు వెనకనే వస్తున్న ప్యాసింజర్ ఆటో (టీజీ35టీ 0168) కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక ప్యాసింజర్ ఆటోలో ముగ్గురు, మరో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురిలో మెదక్ జిల్లా పేరూరు గ్రామానికి చెందిన పాపగారి మనీషా(26), నర్సాపూర్ మండలం రుస్తుంపేటకు చెందిన ఐశ్వర్య(19), నర్సాపూర్ మండలం ఎల్లారెడ్డిగూడ తండాకు చెందిన ప్రవీణ్(30) ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు.
మరో ఐదుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలు కావడంతో హుటాహుటిన సూరారం మల్లారెడ్డి దవాఖానకు తరలించారు. ఇందులో మార్గమధ్యలో కౌడిపల్లి మండలానికి చెందిన అనుసూయ(62) మృతిచెందింది. క్షతగాత్రులకు మల్లారెడ్డి దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. ఆటోడ్రైవర్ సంతోష్ పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీ దవాఖానకు తరలించారు. కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జిన్నారం సీఐ నయిమోద్దీన్ తెలిపారు.
రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం ఐడీఏ జీడిమెట్ల సంజయ్‌గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న పాపగారి మనీషాకు ఇటీవల నర్సాపూర్‌లో పంచాయతీ రాజ్ శాఖలో ఏఈఈగా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగానికి వెళ్తున్న మనీషా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలియగానే తోటి ఉద్యోగులు ఘటనా స్థలానికి చేరుకుని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సాపూర్ మండలానికి చెందిన దూది ఐశ్వర్య కాలేజీకి వెళ్లింది. కాలేజీకి తోటి విద్యార్థులు ఎవరూ రాకపోవడంతో తిరిగి ఇంటికి ఆటోలో వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. మరో యువకుడు ప్రవీణ్ నర్సాపూర్ నుంచి ఆటోలో వస్తూ మృతి చెందాడు. మనీషా తల్లిదండ్రులు నర్సాపూర్ దవాఖానలో తమ కూతురు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. ఇటీవల ప్రభుత్వం ఉద్యోగం రావడంతో ఆనందపడిన తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలించిందని విలపించారు. చదువులో చురుగ్గా ఉన్న ఐశ్వర్య మృతితో తండ్రి అనిల్‌తోపాటు కుటుంబీకులు విలపించారు.
కారు, ఆటోలు ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందిన విషయం తెలియడంతో వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. జిన్నారం సీఐ నయీమొద్దీన్, ఎస్సై మహేశ్వర్‌రెడ్డి సిబ్బందితో వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. మృతులను నర్సాపూర్ దవాఖానకు తరలించా రు. క్షతగాత్రులను మల్లారెడ్డి దవాఖానకు అంబులెన్స్ ద్వారా తరలించారు.
రోడ్డు ప్రమాదంలో అనసూయా, ప్రవీణ్, ఐశ్వర్య, మనీషాను మృత్యువు కబలించడంతో నర్సాపూర్ సర్కారు దవాఖాన వద్ద రోదనలు మిన్నంటాయి. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మె ల్యే మదన్‌రెడ్డి, పలువురు నాయకులు బాధిత కుటుంబాలను ఓదార్చారు.
ప్రమాద ఘటనా స్థలాన్ని శుక్రవారం సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు, పటాన్చెరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, జిన్నారం సీఐ నయిమొద్దీన్తో కలిసి పరిశీలించారు.
నర్సాపూర్, జనవరి 3: నల్లవల్లి అటవీ ప్రాం తం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ దవాఖానలోని మార్చురీకి తరలించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మార్చురీకి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఆమె వెంట మున్సిపల్ వైస్‌చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ నాయకులు సత్యంగౌడ్, సూరారం నర్సింహులు, శివకుమార్, చంద్రశేఖర్, జితేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.