చిన్నకోడూరు మండలం మల్లారం శివారులో కారును ఢీకొన్న లారీ
కారు డ్రైవర్‌తో సహా భార్యాభర్తలు దుర్మరణం
కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదం
మద్యం మత్తులో లారీ నడిపిన డ్రైవర్
మృతులది రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల
చిన్నకోడూరు, జూన్ 12 : సిద్దిపేట-కరీంనగర్ రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తు లో లారీ డ్రైవర్ అతివేగంగా కారును ఢీకొట్టగా, ఈ ఘటనలో మృగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు. ఆదివారం చిన్నకోడూరు మండలం మల్లారం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరేళ్ల గ్రామానికి చెందిన రిటైర్డు లెక్చరర్ తాండ్ర పాపారావు (64), పద్మ (58) దంపతులు. వీరు కరీంనగర్లో నివాసముంటున్నారు. వీరి కుమారుడు, కూతురు ప్రీతమ్‌రావు, అనూష అమెరికాలో ఉంటున్నారు. కరీంనగర్లో కారు మాట్లాడుకుని డ్రైవర్ గొంటి ఆంజనేయులు (48)తో హైదరాబాద్ బయలుదేరారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 9 గంటలకు మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ శ్రీనివాస్ రాంగ్రూట్లో అతివేగంగా వచ్చి మల్లా రం శివారులో కట్టమైసమ్మ గుడి వద్ద కారును ఢీకొట్టాడు.
కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కారును సుమారు 50 మీటర్ల ముందుకు లారీ లాక్కెళ్లింది. రోడ్డుపై రెండు వాహనాలు ఢీకొనడంతో పెద్దఎత్తున ట్రాఫి క్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న చిన్నకోడూ రు ఎస్సై శివానందం, సిద్దిపేట రూరల్ సీఐ జానకిరాంరెడ్డి, నంగునూరు ఎస్సై మహిపాల్‌రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు లో ఇరుక్కుపోయిన మృతదేహాలను జేసీబీ సహాయంతో బయటకు తీశారు. మృతదేహాలను సిద్దిపేట జిల్లా దవాఖానకు తరలించారు. మృతురాలి సోదరుడు శ్రీనివాస్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివానందం తెలిపారు.