Medak | నిజాంపేట, మార్చి7 : రోజు రోజుకు భూగర్భజలాలతో పాటు రైతుల ఆశలు కూడా అడుగంటుతున్నాయి. యాసంగి సీజన్ ప్రారంభంలో బోర్ల నుంచి సమృద్ధిగా వచ్చిన నీళ్లను చూసిన రైతులు వరి, మొక్కజొన్న పంటల సాగు చేశారు. గడిచిన రెండు నెలల వ్యవధిలోనే నిజాంపేట మండల వ్యాప్తంగా భూగర్భజలాలు వేగంగా అడుగంటాయి. దీనితో వరి పంట పొలాలన్నీ నీళ్లు లేక ఎండిపోయి నెర్రలు బారుతున్నాయి. పంటల సాగు కోసం పెట్టిన పెట్టుబడి కూడ వస్తుందో రాదో అని రైతులు వారిలో వారు కుమిలిపోతున్నారు. ఎండిపోయిన పంట పొలాలను వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి ఒక ఎకరానికి రూ.15 వేలు నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వంను మండల రైతులు కోరుతున్నారు.
మొదట్లో బోరు నుంచి మంచిగా నీళ్తు వస్తుండే.కాని ఇప్పుడు బోరు నుంచి సరిగ్గా నీళ్లు వస్తాలేవు. మా ఊరి వరకు కాలువలు నిర్మించిన బాగుండు. రెండు ఎకరాల వరకు వరి పొలం ఏసిన. ఇప్పుడు బరాన వంతు ఎండిపోయి చరాన వంతు పొలం వరుస తడులతో పారుతున్నది. ఎండిపోయిన పొలంకు ప్రభుత్వం ఏమైన నష్టపరిహారం చెల్లించాలి.
-చంద్రయ్య రైతు, నందగోకుల్, నిజాంపేట మండలం