హుస్నాబాద్, ఆగస్టు 25 : ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధుడి పేరు దుర్గాని మల్లయ్య. ఈయనది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గ్రామం. ఇతను డబ్బు ఏండ్లు దాటి వయసుంటది. కొన్ని రోజులుగా యూరియా కోసం కొడుకు తిరుగుతున్నప్పటికీ దొరకక పోవడంతో తనను యూరియా కోసం లైన్లో నిలబడమని ఇక్కడ దించిపోయాడని ఈయన చెప్పాడు.
ఇతను నాలుగు రోజుల నుంచి హుస్నాబాద్‌లోని సహకారం పరపతి సంఘం కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నా బస్తా యూరియా కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నాలుగు రోజుల సంది తిరుగుతున్న సారూ… పొద్దటి నుంచి తిండి కూడా లేదు…నా కొడుకు మూడు ఎకరాల్లో వరిపంట వేసిండు. బాయి దగ్గర పనిచేసుకుంటుండు…నేను కాగితాలు ఇచ్చి కనీసం ఒక్క బస్తా అయినా దొరుకుతదని ఎదురు చూస్తున్న…’ అంటూ తన గోడును వెల్లబోసుకున్నాడు.
ఇదే ఫొటోలో మరో వైపు కూర్చున్న వద్ధురాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) గ్రామానికి చెందిన గుండు రాధవ్వ. ఈమె మూడు రోజుల నుంచి యూరియా కోసం సహకారం సంఘం కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తోంది. సోమవారం కూడా యూరియా కోసం వచ్చి ప్యాక్స్ కార్యాలయం వద్ద ఉన్న మెట్లపై కూర్చుంది.‘మేం ఎకరం పొలం పెట్టినం. వరి పచ్చబడాలంటే యూరియా వేయాలె. అందుకే నా కొడుకు ఒక దుకాణం వద్ద నేను ఇక్కడ యూరియా బస్తా కోసం ఎదురు చూస్తున్నం…కాగితాలు తీసుకొని మూడు రోజులైతంది. బస్తా మాత్రం ఇస్తలేరు.
తిండి లేక గావరైతంది… ఇంకెన్ని రోజులు తిరగాలో తెల్వడం లేదు…’ అంటూ ఆవేదనతో తెలిపింది. సోమవారం హుస్నాబాద్‌లోని ప్యాక్స్ కార్యాలయంతో పాటు మరో రెండు దుకాణాల్లోకి యూరియా వచ్చిందని తెలిసి రైతులు పరుగులు పెట్టారు. ఆయా దుకాణాల వద్ద బస్తాల కోసం పోటీ పడ్డారు. రోజూ బండ్లు వేసుకొని రావడం హుస్నాబాద్ మొత్తం తిరుగుతూ ఏ దుకాణంలోకి యూరియా వచ్చిందో తెలుసుకుంటూ ఆ దుకాణం వద్ద లేను కట్టి దొరికిన రైతులు సంతోషంగా వెళుతుండగా, బస్తా దొరకని రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇదీ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంతో పాటు డివిజన్లోని రైతుల పరిస్థితి.