నర్సాపూర్, మే 15: ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని తుజాల్పూర్కు చెందిన రైతులు శుక్రవారం నర్సాపూర్ లోని చౌరస్తా వద రోడ్డుపై ధాన్యం పోసి ధర్నా, రాస్తారోకో చేశారు. దీంతో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు జోక్యం చేసుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన వినలేదు. నర్సాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి ధాన్యాన్ని కొనుగోలు చేసి తరలిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోగ చంద్రశేఖర్, తుజాల్పూర్ రైతు శ్రీరాంయాదయ్య మాట్లాడుతూ.. ధాన్యం సక్రమంగా కొనుగోలు చేయకపోవడంతో కల్లాల్లో పెద్ద ఎత్తున పేరుకుపోయిందని తెలిపారు. తూకం వేసి వారం రోజులైనా లారీలు రాక ధాన్యం తరలించడం లేదన్నారు. కాంటాలకు, ధాన్యం తరలించడానికి కొనుగోలు కేంద్రాల రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నామని, అకస్మాత్తుగా వర్షమొస్తే తమ పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నించారు.వేగంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేశారు.