చిన్నకోడూరు, మే3: ఎంతమంది రైతుల ఉసురు పోసుకుంటావ్ రేవంత్‌రెడ్డి, ఇంకెంతమంది రోడ్డెక్కాలి.. వడదెబ్బ తగిలి ధాన్యం కుప్పల మీదనే రాలిపోయే దుస్థితి రావడం చాలా భాదాకరం.. అయినా రేవంత్ రెడ్డిలో రైతులపైన కనికరం కలగడం లేదు.. నువ్వు ఒరిజినల్ రైతు బిడ్డవి కాదని, డూప్లికేట్ వని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారం రాజీవ్ రహదారిపై ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ఆదివారం చేసిన రాస్తారోకోకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మద్దతు తెలిపారు. రాస్తారోకోలో పాల్గొన్నారు. రైతులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రాజీవ్ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వడ్ల కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వడ్లు కొనొద్దనే ఉద్దేశంతో రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ రైతుల గోస పెడుతున్నట్లు ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. పేరుకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని, ఒక గింజ కూడా కొనలేదన్నారు. కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసి 28 రోజులు అవుతున్నా కొనడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేడ్ల పేరిట, తాలు ఉన్నదని, కోతల పేరిట తమల్ని రకరకాలుగా ఇబ్బందులకు పెడుతున్నారన్నారు. మొకజొన్న రైతులకు నాలుగు రోజుల నుంచి గన్నీ బ్యాగులు లేవని చెబుతున్నారన్నారు. కుప్పల దగ్గర కావలి కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పొద్దు తిరుగుడు పువ్వు కొనరని, జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు ప్రారంభించలేదన్నారు. శనిగల కొనుగోలు కేంద్రాలను మధ్యలోనే ఆపేశారన్నారు.
జిల్లాకు ఒక ఉన్నతాధికారిని నియమించాలి
ధాన్యం కొనేందుకు ప్రతి జిల్లాకు ఒక ఉన్నతాధికారిని నియమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాం డ్ చేస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రైతులు ఎండలో రాస్తారోకో చేశారని, తాను కలెక్టర్‌తో మాట్లాడితే రూల్స్ అంతే అంటున్నారని, రైతులకు సంఘీభావం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో జొన్న, మకలు కొనడం లేదని రైతులు బాధపడతున్నారన్నారు. నల్గొండ జిల్లాలో ఒకొక రైస్ మిల్ దగ్గర 30 నుంచి 50 లారీలు లైన్లో ఉంటున్నాయన్నారు. మిల్లులో ధాన్యాన్ని దించుకోవడం లేదన్నారు.
10 పైసల వడ్లు కొనలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం
90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు 9 లక్షలు టన్నుల వడ్లు కొనలేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. మద్దతు ధర రాక తకువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ములకల కనకరాజు, కీసర పాపయ్య, ఉమేశ్‌చంద్ర, జంగిటి శ్రీనివాస్, కొండం రవీందర్‌రెడ్డి, మోసర్ల మధుసూదన్‌రెడ్డి, బీఆర్ఎస్వీ నాయకులు, పాల్గొన్నారు.