మెదక్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. పీఏసీఎస్ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పనులన్నీ మానుకొని సరఫరా కేంద్రాల వద్ద రోజంతా క్యూలో పడిగాపులు కాస్తున్నారు. ప్రైవేట్ డీలర్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలకు సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యూరియా అందుబాటులో ఉండేది.
మెదక్ జిల్లాలోని మెదక్, తూప్రాన్, నర్సాపూర్ రెవెన్యూ డివిజన్లలోని పలు ప్రాంతాల్లో యూరియా కొరత ఏర్పడింది. దీంతో రైతులు యూరియా కోసం ప్రైవేట్ సబ్ డీలర్లు, ఫర్టిలైజర్ షాపులు, సహకార సంఘాలు, ఇతర కేంద్రాల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని రామాయంపేట మండలం కాట్రియాలలో యూరియా బస్తాల కోసం రైతులు ఇబ్బందులు పడ్డారు.వెల్దుర్తి ప్రాథమిక సహకార సంఘం వద్ద రైతులు యూరియా కోసం క్యూ కట్టారు.వానకాలంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 3.05 లక్షల ఎకరాల పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది.
డిమాండ్‌కు తగ్గట్టుగా యూరియా సరఫరా లేదు
మెదక్ జిల్లాలో వానకాలం సీజన్లో వరి దాదాపు 3.05 లక్షల ఎకరాలు, పత్తి 34,283 ఎకరాలు, మొకజొన్న 2572 ఎకరాల్లో సాగుచేశారు. పలు ప్రాంతాల్లో వరిని తగ్గించి మొకజొన్న సాగు చేస్తున్నారు. గత సంవత్సరం మొకజొన్న 2429 ఎకరాల్లో సాగవగా, ఈ సారి 2572 ఎకరాల్లో సాగు చేశారు. వరి ఎకరాకు ఒకటిన్నర బస్తాల యూరియా వేయాల్సి ఉండగా మూడు బస్తాల వరకు వేస్తున్నారు.
మొకజొన్న ఎకరాకు రెండు బస్తాలకు సుమారు 5 నుంచి 8 బస్తాలు వేస్తున్నారు. యూరియాపై సబ్సిడీ ఉండడంతో బస్తా ధర రూ.266 లోపు ఉండగా, డీఏపీ ధర సుమారు రూ.1,340 వరకు ఉండడంతో యూరియా వాడకం పెరిగింది. ప్రస్తుత సీజన్‌కు 18వేల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 14వేల మెట్రిక్ టన్నులు జిల్లాకు వచ్చింది. ఈ నెల చివరి వరకు మరో 4వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది.
అవసరం మేరకు యూరియా సరఫరా చేస్తున్నాం
మెదక్ జిల్లాలో అవసరం కంటే ఎకువగా యూరియాను వినియోగిస్తున్నారు. ప్రస్తుత వానకాలం సీజన్లో జిల్లాకు 18వేల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 14వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. ఈ నెల చివరి వరకు మరో 4వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా 3.05 లక్షల ఎకరాల్లో వరి సాగు కావాల్సి ఉండగా, 2.47 లక్షల ఎకరాలు సాగైంది. ఇంకా రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడానికి ప్రయత్నిస్తున్నాం.
-దేవకుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, మెదక్
అరిగోస పడుతున్న రైతులు
గజ్వేల్, ఆగస్టు 14: రాష్ట్రంలో కాంగ్రెస్ చేతకాని ప్రభుత్వంతో రైతులు యూరియా కోసం రోజుల తరబడి ఇబ్బందులు పడుతున్నా కనీసం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఇందిరాపార్కు చౌరస్తాలో యూరియా కోసం రైతులు చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందు చూపులేని కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో రైతులు అరిగోస పడుతున్నారన్నారు.
గతంలో ఎన్నడూలేని విధంగా రైతులు యూరియా కోసం రోడ్డెక్కే పరిస్థితులకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. కేసీఆర్ పదేండ్ల కాలంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు రైతులు యూరియా తీసుకునే విధంగా అందుబాటులో ఉంచారని కానీ నేడు సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నిర్లక్షం కారణంగా చేతికొచ్చిన పంటకు యూరియా వేసుకునే పరిస్థితులు లేకుండా చేశారని మండిపడ్డారు.
రాష్ట్రం నుంచి 16మంది ఎంపీలు ఉన్నా కేంద్రం నుంచి రాష్ర్టానికి సరిపడా యూరియా తీసుకురావడంలో పూర్తిగా ఆరోపించారు. ప్రతి రోజూ యూరియా కోసం రైతులు ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదన్నారు. జిల్లా అధికారులు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవా లని ఆయన కోరారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధు, పట్టణ అధ్యక్షుడు నవాజ్‌మీరా, నాయకులు నర్సింగరావు, శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, దయాకర్‌రెడ్డి, మల్లేశం, కృష్ణారెడ్డి, గోపాల్‌రెడ్డి, గుంటుక రాజు, దుర్గాప్రసాద్, కల్యాన్కర్ శ్రీను, అశోక్, హనుమంతరెడ్డి పాల్గొన్నారు.
రైతులకు తప్పని తిప్పలు
చేగుంట, ఆగస్టు14: చేగుంటలో గురువారం ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి యూరియా వచ్చిందని తెలియడంతో రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. క్యూలో ఉన్న వారికి రెండు బస్తాల చొప్పున ఇచ్చారు. రెండు,మూడు ఎకరాల ఉన్న వారు ఎక్కడికిపోయి తెచ్చుకోవాలని, బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఇలా జరగలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా అందుబాటులో ఉండేవిధం గా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
కాట్రియాల గ్రామంలో…
రామాయంపేట, ఆగస్టు 14: మండలంలోని కాట్రియాల గ్రామంలోని సొసైటీ కార్యాలయానికి యూరియా వస్తుందని అధికారులు చెప్పారు. గురువారం ఉదయం ఆరు గంటలకే సొసైటీ కార్యాలయానికి రైతులు చేరుకుని క్యూలో బారులు తీరారు. పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కర్షకులు చేరుకోవడంతో ఉత్కంఠ నెలకొన్నది. విషయం తెలుసుకున్న రామాయంపేట వ్యవసాయశాఖ ఇన్చార్జి ఏడీఏ రాజ్‌నారాయణ వెంటనే సంబంధిత డీలర్లకు ఫోన్ చేసి అప్పటికప్పుడు లారీ యూరియా బస్తాలను తీసుకువెళ్లి అక్కడ బారులు తీరిన రైతులకు ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున అందజేశారు.దీంతో రైతులు శాంతించారు.
వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన
దుబ్బాక, ఆగస్టు 14 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి తర్వాత గడ్డు కాలం దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్ చౌరస్తాలో యూరియా కోసం రోడ్డు పై బైఠాయించి ధర్నా చేశారు. వద్దురా నాయనా కాంగ్రెస్ పాల నా…సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న దుబ్బాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించి యూరియా అందే విధంగా తగు చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు చొరవ తీసుకొని సరిపడా యూరియా పం పిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.