తొగుట,జూన్ 1: రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మక్క, వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని సిద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపూర్ వద్ద సోమవారం రైతులు ధర్నా చేపట్టారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి సంఘీభావం తెలిపారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వరి,మక్క ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు.
కొనుగోలు కేంద్రాలకు లారీలను తీసుకురావడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వానకాలం సీజన్ వచ్చినప్పటీకి ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉండటం సిగ్గుచేటన్నారు. గులాబీ అధినేత కేసీఆర్ ఉండగా ఎలాంటి ఇబ్బందులు రాలేదని గుర్తు చేశారు. సీఎం రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అన్నీ కష్టాలే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు స్పందించి వెంటనే రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన రైతులు పాల్గ్గొన్నారు.