అల్లాదుర్గం, మే 29 : ధాన్యం సేకరణలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కారు.మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌కు చెందిన రైతులు గురువారం 161వ జాతీయ రహదారిపై గడిపెద్దాపూర్ వద్ద రాస్తారోకో చేపట్టారు.రోడ్డుపై వాహనాలు,ధాన్యం మ్యాచర్ పరికరాన్ని అడ్డంగా పెట్టి అన్నదాతలు ఆందోళన చేపట్టడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో తూకం వేసి ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతున్నదని,దీంతో తా ము ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. పది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో ధాన్యం తడిసి పోతున్నదన్నారు.
అధికారుల తీరుతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.వర్షాలతో ధాన్యం తడిసి పోవడం వల్ల, ప్రభుత్వ నిబంధనల ప్రకారం మ్యాచర్ రాకపోవ డం వల్ల జాప్యం జరుగుతున్నదని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు,అధికారులు అంటున్నారు. రైతులు చేపట్టిన రాస్తారోకో గంట పాటు కొనసాగడంతో విషయాన్ని తెలసుకున్న అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడా రు.రైతుల ఇబ్బందులను సంబంధిత అధికారులకు విన్నవించారు.
దీంతో రైతులు తమ ఆందోళనను విరమించారు.రైతుల రాస్తారోకో విషయం తెలుసుకున్న పౌరసరఫరా శాఖ అధికారులు జగదీశ్‌కుమార్, సురేశ్‌రెడ్డి గడిపెద్దాపూర్ కొనుగోలు కేంద్రంతో పాటు అల్లాదుర్గంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం తరలింపులో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, గడిపెద్దాపూర్‌లోని కొనుగోలు కేంద్రంలో నిలవ ఉన్న ధాన్యాన్ని మూడు రోజుల్లో తరలిస్తామని,అల్లాదుర్గంలో ఉన్న ధాన్యాన్ని వారం రోజుల్లోగా కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. వారి వెంట తహసీల్దార్ మల్లయ్య,ఏపీఎం నాగరాజు ఉన్నారు.