శివ్వంపేట, మే 25 : మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని రత్నాపూర్ గ్రామ రైతులు సోమవారం శివ్వంపేట పీఏసీఎస్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లను తరలించేందుకు ఇప్పటివరకు లారీలు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చామని, అయితే రోజుల తరబడి ధాన్యం అక్కడే నిల్వ ఉండిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నామని తెలిపారు. లారీలు పంపించాలని పలుమార్లు పీఏసీఎస్ సీఈఓ మధుకు ఫోన్ చేసినప్పటికీ స్పందించడం లేదని ఆరోపించారు.
ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నాయని, ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ధాన్యం తడిసి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాన్ని అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు అవసరమైన లారీలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
సమస్యను వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం రైతులు నర్సాపూర్–తూప్రాన్ ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ మధుకర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.