హుస్నాబాద్ టౌన్, అక్టోబర్ 28: ఈడ మాకు ఎకరం.. రెండెకరాల భూమి ఉన్నది… ఇండ్లనే ముందుటికెల్లి పదిగుంటలు… ఎనకకెల్లి పదిగుంటలల్ల కాల్వ తీసినంక మేం ఎట్ల బతకాలే… మీరు ఇట్లసెయ్యబట్టే తిప్పట్ల మొండ య్య అనే రైతు గుండెపోటుతో చనిపోయిండు. అయినా మీరు మారరా అంటూ ఇరిగేషన్ అధికారులపై రైతులు మండిపడ్డారు. మీరు బలవంతంగా సర్వే చేస్తే పురుగుల మందుతాగి ఇక్కడనే సత్తమంటూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులోని డబుల్ బెడ్రూం ప్రాంతం సమీపం నుంచి కరీంనగర్ రోడ్‌లోని పాలకేంద్రం వరకు నిర్మించే గౌరవెల్లి రిజర్వాయర్ ఎడమకాల్వ సర్వేకు వచ్చిన ఇరిగేషన్ అధికారులను రైతులు రెండున్నర గంటలపాటు అడ్డుకున్నారు. దీంతో మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది.
హుస్నాబాద్ పట్టణ శివారు నుంచి దాదాపు కిలోమీటరుపైగా ఎడమకాల్వ 13ఎల్‌ను నిర్మించాలని ఇరిగేషన్ అధికారులు నిర్ణయించారు. దీనికోసం మంగళవారం సర్వేకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. ఉన్న కొద్దిపాటి భూమిని మీరు కాల్వకింద తీసుకుంటే మేం ఎట్ల బతకాలి అంటూ వారు ప్రశ్నించారు. ఇప్పటికే చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చామని, మాభూములు కాల్వలకు ఇయ్యమని చెప్పినా పట్టించుకోకుండా దౌర్జన్యంగా, దొంగచాటుగా సర్వేకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. సర్వే నిలిపివేయకుంటే ఇక్కడే మందుతాగి చస్తామంటూ రైతులు బెదిరించారు.
దీంతో ఇరిగేషన్ ఏఈ నెహ్రూ ఆధ్వర్యంలోని అధికారులు సర్వేను నిలిపివేసి డీఈఈ,తహసీల్దార్‌కు సమాచారం ఇచ్చారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న తహసీల్దార్ లక్ష్మారెడ్డి అక్కడికి చేరుకున్నారు. సమస్యను విన్న ఆయన పరిష్కారం ఎలా చేయోలో చెప్పాలని రైతులను కోరారు. మేం భూములు ఇవ్వమని, కాల్వ నిర్మాణం చేయవద్దని, అలైన్మెంట్ మార్చాలని రైతులు స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్మించిన కాల్వనుంచి నీటిని ఎత్తిపోయాలి తప్ప కొత్తగా భూములు ఇచ్చేదిలేదని రైతులు తేల్చిచెప్పారు. ఈ సమయంలో అక్కడకు చేరుకున్న ఇరిగేషన్ డీఈఈ ప్రశాంత్‌తో రైతులు వాగ్వాదానికి దిగారు. అలైన్మెంట్ మార్చేందుకు అవకాశం ఉన్నా, ఎందుకు మార్చడంలేదన్నారు. కావాలని రైతులపై కక్షకట్టారని రైతులు ఆయన్ని నిలదీశారు.
మా భూములను లాక్కునేందుకు వస్తే మందుతాగి చస్తామంటూ పురుగుల మందు డబ్బాతీసి చూపించారు. మేం చచ్చినంక మా శవాలపై నడిచి తీసుకుని కాల్వలు కట్టుకోండంటూ రైతులు నిప్పులు చెరిగారు. గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణానికి భూమిపోయిందని, లక్షల రూపాయలు పెట్టి ఇంటి స్థలం కొన్న ఇక్కడ కూడా కాల్వతీస్తే ఎలా బతకాలని అంటూ ఆవేదనతో ఇక నాకు చావే దిక్కు అంటూ లావుడ్యా బీమానాయక్ అనే రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్ల స్థలాలు, కొద్దిపాటి వ్యవసాయ భూములు ఉన్న ఇండ్లకెల్లి కాల్వలు తీస్తే ఊరుకునేదిలేదన్నారు.
ఇప్పటికే తనకు గుండెపోటు వచ్చిందని రైతు మర్యాల మహేశ్వర్‌రెడ్డి అధికారులతో వాపోయాడు. అలైన్మెంట్ మార్చకుంటే పెట్రోలు పోసుకుంటానని కాంగ్రెస్ నాయకుడు బూరుగు కిష్టస్వామి పెట్రోల్డబ్బా చూపిస్తూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయినా మీరు మారకుంటే ఏమిచేయాలో అది చేస్తామని రైతులు అధికారులను హెచ్చరించారు. రైతులతో మరోసారి చర్చించి కాల్వ ఎలా నిర్మించాలనే విషయంపై చర్యలు తీసుకుంటామని తహహసీల్దార్ లక్ష్మారెడ్డి, డీఈఈ ప్రశాంత్ రైతులకు హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.
ఆందోళనలో బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, బీఆర్ఎస్వీ నాయకుడు మేకల వికాస్‌యాదవ్, భారతీయ కిసాన్ సంఘం నాయకుడు కవ్వ వేణుగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు బూరుగు కిష్టస్వామి, రైతులు గొర్ల బాలయ్య, పీతాంబరం. కుమారస్వామి, చెన్నబోయిన రవీందర్, విద్యాసాగర్, పార్నంది లాజరస్, అనంద్, సావుల కోటేశ్వర్రావు, బూరుగు సతీశ్, ఖాతా మొండయ్య, జాల లస్మయ్య, సుగుణ పాల్గొన్నారు. అధికారుల వెంట ఆర్ఐ రాజయ్య, సర్వేయర్ లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు