మెదక్, మే 8(నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని పలు మండలాలకు చెందిన రైతులు, కాంగ్రెస్ నాయకులు మెదక్ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం వడ్లు పోసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు ఆరబెట్టినా కాంటా కావడం లేదన్నారు. అధికారులు సకాలంలో లారీలు పంపడం లేదని, పంపినా రైస్‌మిల్లుల వద్ద లారీల్లో ఉన్న ధాన్యం ఖాళీ చేయడం లేదన్నారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినా అమలు చేయడం లేదన్నారు.
అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, నిబంధనల పేరుతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అకాల వర్షంతో పంట నష్టం జరిగే ప్రమాదం ఉందని, రైతులు పండించిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న కొందరు రైతులు పెట్రోల్ పోసు కునేందుకు ప్రయత్నం చేయగా అధికారులు అడ్డుకున్నారు.
మెదక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న సమాచారం తెలుసుకున్న డీఎస్వో నిత్యానంద్గౌడ్తో పాటు రెవెన్యూ, పోలీస్‌శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, ఎక్కడా నిర్లక్ష్యం లేదన్నారు. రైతులు పండించిన చివరి గింజ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల 20 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపించారు. వడ్లు రైస్ మిల్లులకు తరలించేందుకు అధికారులు లారీలు అందుబాటులో ఉంచడం లేదన్నారు. వడ్లు విక్రయించినా సకాలంలో డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరులో మార్పురాకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.