కొల్చారం, ఆగస్టు 30: నెల రోజులుగా తిరుగుతున్న యూరియా ఇవ్వడం లేదని, పంటలు దక్కేది ఎట్లా అంటూ రైతులు రాస్తారోకో (Farmers Protest) చేశారు. ప్రభుత్వం వెంటనే యూరియా సరఫరా చేయాలంటూ కొల్చారం మండలంలోని రంగంపేటలో రైతులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు 30 రోజులుగా ప్రతిరోజు రంగంపేట సొసైటీకి రావడం, ఆధార్ కార్డు జిరాక్సులు క్యూ లైన్లో ఉంచడం.. చివరకు ఉత్త చేతులతో ఇంటికి వెళ్లడం జరుగుతుందన్నారు. అధికారులేమో ఏరోజుకారోజు రేపు వస్తుందని చెబుతూ వస్తున్నారని, నెల గడిచినా యూరియా వస్తలేదన్నారు.
కాలం దాటిపోయాక యూరియా వచ్చినా పంటలు చేతికి రావని, సరైన దిగుబడి లేక నష్టాలు చవిచూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మండల వ్యవసాయ అధికారి శ్వేతా కుమారి ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రైతులు యూరియా కావాల్సిందేనని వ్యవసాయ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఏవో ఆదివారం తప్పకుండా రెండు లారీల యూరియా తెప్పిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.