రాయపోల్, డిసెంబర్ 3: పంట రుణమాఫీ కోసం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతులు మంగళవారం రాయపోల్ రైతు వేదిక వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సంవత్సరం గడుస్తున్నా ఇంత వరకు రుణమాఫీ జరగకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఒకరికి పంట రుణమాఫీ కావాల్సి ఉన్నా కాలేదన్నారు. నాలుగు విడతలుగా పంట రుణమాఫీ అయితదని ఎంతో ఆశతో ఎదురుచూసినా నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని నిబంధనల ప్రకారం అర్హులైన రైతులకు పంట రుణమాఫీ చేసి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.