మెదక్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ): మెదక్ ఎమ్మెల్యే మైనంపలి రోహిత్ సొంతూరు చిన్నశంకరంపేట్ మండలం కొర్విపల్లిలో చాలామంది రైతులకు మూడో విడత రుణమాఫీ వర్తించకపోవడం తో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేకమంది రైతుల పేర్లు మాఫీ జాబితాలో గల్లంతయ్యాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు సమాచారం కోసం బ్యాంకులు, కార్యాలయాల వద్దకు పరుగులు తీస్తున్నారు.
వ్యవసాయ శాఖ అధికారు లు ఏదో ఒకటి సర్దిచెప్పి పంపిస్తున్నారు. కొర్విపల్లి కి చెందిన రైతులు జంగరాయి సొసైటీలో రుణాలు తీసుకున్నారు. ఈ సొసైటీలో 54మంది లోన్లు తీసుకోగా, ఇప్పటివరకు 30మందికి మాత్రమే మాఫీ అయ్యింది. మిగతా వారికి రుణ మాఫీ కాకపోవడంతో సొసైటీ కార్యాలయం వద్దకెళ్లి సిబ్బందిని అడగ్గా, తాము జాబితాను ప్రభుత్వానికి పంపినట్లు సమాధానం ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు.
రుణమాఫీకి రేషన్‌కార్డు ప్రామాణికం కా దని సీఎం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రేషన్‌కార్డు యూనిట్‌గా రుణమాఫీ చేస్తుండడంతో ఇప్పటికే చాలామందికి అన్యాయం జరిగింది. రేషన్‌కార్డు లేని వారికి అస లు మాఫీ జరగలేదు. దీనిపై వ్యవసాయాధికారులను సంప్రదిస్తే రేషన్‌కార్డు లేనోళ్లకు సర్వే చేసిన తర్వాత మాఫీ చేస్తారని చెబుతున్నారు. లిస్టులో పేర్లున్నప్పటికీ కొందరు రైతులకు రుణాలు మాఫీ కాలేదు. బ్యాంకులకు వెళ్లి అడిగితే ప్రాసెస్‌లో ఉం ది రేపో.. ఎల్లుండో పడుతుందని చెబుతున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
చిలిపిచెడ్,ఆగస్టు 23: నేను చిట్కుల్ ఏపీజీవీలో రూ.1.60లక్షల క్రాప్‌లోన్ తీసుకున్నా. మూ డు నెలల కిందనే బ్యాంకుకు వెళ్లి క్రాప్‌లోన్ రెన్యువల్ చేస్తానని చెబితే.. ఇప్పుడు వద్దు త్వరలో రెండు లక్షల పంట రుణమాఫీ వస్తది ఎందుకు కడతావు అన్నారు. వడ్డీతో కలిసి ఇప్పుడు రెండు లక్షల ఎనిమిది వేలు ఉన్నాయి. ఎనిమిది వేలు కడితే మాఫీ అయితాయి అని బ్యాంక్ అధికారులు చెప్పడంతో కట్టా. మూడో విడతలో కూడా పేరు రాలేదు. రెగ్యులర్‌గా రుణాలు చెల్లించిన వాళ్లకే పంట రుణమాఫీ కావడం లేదు.
– తేజానాయక్, రైతు,గన్యాతండా గౌతాపూర్, చిలిపిచెడ్ మండలం, మెదక్ జిల్లా
రుణమాఫీ జాబితాలో నాపేరు రాలేదు. నేను చిన్న శంకరంపేట డీసీసీబీలో 2019లో లక్షా ఇరవై వేల అప్పు తీసుకున్నా. అప్పటి నుంచి రెగ్యులర్‌గా రెన్యువల్ చేశాను. అయినా నాకు మాఫీ వర్తించలేదు. మాఫీఅయ్యేలా చూడాలని అధికారులను కోరుతున్నా.
-మోకిరే బాలమల్లు, రైతు, కొర్విపల్లి
కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీపై గొప్పలకు పోతున్నది. నాకున్న రెండెకరాల భూమిపై ఎస్బీఐ బ్యాం కులో రూ.70వేల రుణం తీసుకున్న. వడ్డీతో కలిపి అప్పు లక్ష రూపాయలు అయ్యింది. రేవంత్‌రెడ్డి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాడని సంతోషపడ్డా. నాకు ఇంకా లక్ష రూపాయల రుణమాఫీ కాలేదు. బ్యాంకు, వ్యవసాయ శాఖ అధికారులను అడిగినా ఎందుకు రుణమాఫీ కాలేదో సరిగ్గా జవాబు చెప్పడం లేదు. నాకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా.
-క్మురంగు జంగయ్య, రైతు,కాశీపూర్
బెజ్జంకి, ఆగస్టు 23 : నాకు మా గ్రామ శివారులో ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. నేను మూడు సంవత్సరాల కింద రూ.1.20 లక్షల పంట రుణం తీసుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం పంటరుణమాఫీ చేయలేదు. ప్రభుత్వం స్పందించి నాకు రుణమాఫీ చేయాలి.
-లక్ష్మి, మహిళా రైతు వీరాపూర్, బెజ్జంకి మండలం, సిద్దిపేట జిల్లా
బెజ్జంకి, ఆగస్టు 23 : గ్రామంలో మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. నేను ఇండియన్ బ్యాంకులో 2022లో రూ.3 లక్షల రుణం తీసుకున్నా. ప్రభుత్వం పంటరుణమాఫీ చేస్తున్నామని చెప్పుతున్నా నాకు ఇంకా పంటరుణమాఫీ కాలేదు. బ్యాంకు అధికారులను అడిగితే మీకు రుణమాఫీ కాలేదన్నారు. కొన్నిరోజులు ఆగాలే ఆతర్వాత స్పష్టత వస్తది అనిచెబుతున్నారు.
-రడం బాలయ్య, రైతు,వీరాపూర్, బెజ్జంకి మండలం, సిద్దిపేట జిల్లా
చిలిపిచెడ్,ఆగస్టు 23: నేను,నా భార్య కలిపి చిట్కుల్ ఏపీజీవీలో రూ.1.97లక్షల రుణం తీసుకున్నాము. మూడో విడతలో కూడా పంట రుణమాఫీ కాలేదు. ఈ విషయంపై వ్యవసాయాధికారులను అడిగితే మీ బ్యాంకు పుస్తకంలో పేరు తప్పుగా ఉన్నది అని చెప్పారు. బ్యాంక్ అధికారులను అడిగితే బ్యాంక్ పుస్తకంలో పేరు సరిగ్గా ఉన్నదని చెబుతున్నారు. ఇద్దరి మధ్య ఎవరిది తప్పు ఉందని అడిగితే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.
-ఎండీ.ఖాసీం, రైతు,చండూర్ గ్రామం, చిలిపిచెడ్ మండలం, మెదక్ జిల్లా
శివ్వంపేట, ఆగస్టు 23:గోమారంలోని ఏపీజీవీబీలో ఇద్దరి పేరు మీద రూ. రెండు లక్షల 31 లేలు పంటరుణం తీసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పంటరుణమాఫీలో మా ఇద్దరిలో ఒక్కరికి కూడా మాఫీ కాలేదు. ఇదేంటని మండల వ్యవసాయ కార్యాలయానికి వచ్చి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నాం. ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే త్వరలో మాఫీ అవుతుందని అధికారులు చెబుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ కార్డు అనుసంధానం లేదంటూనే ఒక్కరికే మాఫీ చేస్తాం అనడం దుర్మార్గం.
-కళ్లెం సత్తిరెడ్డి, భారతమ్మ దంపతులు, నవాబుపేట,శివ్వంపేట మండలం, మెదక్ జిల్లా
మద్దూరు(ధూళిమిట్ట), ఆగస్టు 23: సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులందరికీ అప్పు మాఫీ చేస్తమని చెప్పి, ఇప్పుడేమో కొంతమందికి మాత్రమే అప్పులను మాఫీ చేసిండు. అప్పుడేమో రైతులెవరూ బ్యాంకుల్లో అప్పులు కట్టొద్దు అని చెప్పిండు. ఆయన మాటలు నమ్మి అప్పులు కట్టపోతే ఆ అప్పులు ఇప్పుడు కుప్పలుగా అయినయి. కుప్పలుగా అయిన అప్పులు మాఫీ అయితయి అనుకుంటే మాఫీ కాలేదు. ఇప్పుడు మేము ఏంచెయ్యాలి. రేవంత్‌రెడ్డిని నమ్ముకుంటే రైతులకు అప్పులే మిగిలినయి. బ్యాంకుల్లో అప్పులు ఉన్నోళ్లకు మొత్తం అప్పులు మాఫీ చేయాలి లేదంటే కాంగ్రెస్ సర్కారుకు రైతులు గట్టి గుణపాఠం చెబుతారు.
-ముస్త్యాల శ్రీనివాస్, నర్సాయపల్లి, మద్దూరు మండలం, సిద్దిపేట జిల్లా