రాయపోల్, మే 5: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని రామారం, దౌల్తాబాద్ మండ లం ఇందుప్రియాల్ గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వాన వల్ల కోతకు వచ్చిన వరిపంట పూర్తిగా నేలరాలింది. సోమవారం ఉదయం రైతులు గుర్రలసోఫ వద్ద గజ్వేల్-చేగుంట రహదారిపై బైఠాయించి మూడు గంటల పాటు ధర్నా, రాస్తారోకో చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు కిలోమీటరు పొడవునా వాహనాలు నిలిచిపోయాయి.
వడగండ్లతో వరి పంట పూర్తిగా నేలరాలినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న రాయపోల్, దౌల్తాబాద్ పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను సమదాయించినా వినిపించుకోలేదు. సంబంధిత వ్యవసాయశాఖ అధికారులు వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేదిలేదని రైతులు తేల్చిచెప్పారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు సంబంధిత అధికారులను అక్కడికి రప్పించారు.
మండల ఏవో నరేశ్, మండల ఆర్ఐ భానుప్రకాశ్, దౌల్తాబాద్ ఎస్సై ప్రేమ్దీప్ రైతులను సముదాయించారు.ఈ సందర్భంగా ఏవో నరేశ్ మాట్లాడుతూ వడగండ్ల వానకు నేలకొరిగిన పంటల వివరాలు సేకరిస్తామని, తర్వాత పూరి ్తనివేదికను ఉన్నతాధికారులకు అందజేసి తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. వ్యవసాయ అధికారులు రైతులతో వెళ్లి పంటనష్టం వివరాలు సేకరించారు. రామారం, ఇందుప్రియాల్కు చెందిన రైతులు పాల్గొన్నారు.