సిద్దిపేట, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాం గ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తున్నది. పంట రుణమాఫీ విషయంలో ఒక స్పష్టత లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పంట రుణమాఫీ కాని రైతులు రోడ్డెక్కుతున్నారు. రోజు రోజుకూ నిరసనలు పెరుగుతున్నాయి. అర్హత ఉండి పంటరుణమాఫీ కాని రైతుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించడం లేదు. జిల్లా, మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసి న గ్రీవెన్‌సెల్‌కు దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి.
సిద్దిపేట జిల్లాలో 3,142, మెదక్ జిల్లాలో 3,686 సం గారెడ్డి జిల్లాలో 4,500 మంది రైతులు, మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో11,328 పైగా రైతులు గ్రీవెన్‌సెల్‌కు దరఖాస్తు చేసుకున్నారు.ఇది అధికార లెక్కలు మాత్రమే ..అంతకన్న ఎక్కువ మండల ఏఈవోల వద్ద దరఖాస్తులు ఉన్నాయి. వాటిని అన్నింటిని సాఫ్ట్‌వేర్‌లో అప్లోడ్ చేయాల్సి ఉన్నది. బుధవారం రెండో రోజూ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి ఇండియన్ బ్యాంకు వద్ద రైతులు ఆందోళనకు దిగారు. రెండు లక్షల పైన ఉన్న రైతులు మిగతా డబ్బులు కడితేనే పంటరుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది.
మిగతా డబ్బులకు అప్పులు తెచ్చి కట్టాలా..? ఇప్పటికే రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలకు తెచ్చి బ్యాంకుల్లో కడుతున్నారు. కట్టిన వాటికి పంటరుణమాఫీ ఎప్పుడు చేస్తారో..ప్రభుత్వం చెప్పడం లేదు. త్వరలోనే మండల నోడల్ అధికారులను నియమిస్తున్నట్లు వ్యవసాయశాఖ కమిషనర్ ప్రకటించారు. బీఆర్ఎస్ శ్రేణులు గడపగడపకూ వెళ్లి పంట రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తున్నారు. ఇక రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేయాలని అన్ని మండల కేంద్రాల్లో నేడు (గురువారం) బీఆర్ఎస్ ఆధ్వర్యలంలో రైతలతో కలిసి ధర్నాలు చేపట్టనున్నారు. మండల తహసీల్దార్, నియోజకవర్గ కేంద్రాల్లోని ఆర్డీవో కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతలుగా పంట రుణమాఫీ చేసినట్లు చెబుతున్నది. ఇక్కడ చేసింది గోరంత..చెప్పేది కొండంత ..గ్రామాల్లో 50శాతానికి పైగా రైతులకు పంటరుణమాఫీ కాలేదు. మూడో విడతలో రూ.2 లక్షల వర కు రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతున్నది. మరో మెలికను ప్రభుత్వం పెట్టింది. రెండు లక్షలపైన ఎంత ఉన్నా దానిని రైతు బ్యాంకుకు చెల్లిస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెబుతున్నది. ఈ విషయంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం చేయాలనుకున్న రెండు లక్షల పంటరుణమాఫీ రైతుల లోన్అకౌంట్లో జమ చేసి మిగతా డబ్బులు కట్టమంటే బాగుండు, కానీ, అలా ప్రభుత్వం చేయడం లేదని వారు వాపోతున్నారు. మరికొంత మంది రైతులు రెండు లక్షల పైన ఉన్న డబ్బులు కడితేనే పంటరుణమాఫీ అవుతుందేమోనని అధిక వడ్డీలకు తెచ్చి మిగతా డబ్బులను బ్యాంకుల్లో కడుతున్నారు. ఇలా కట్టిన తమ కు రెండు లక్షల పంటరుణమాఫీ చేస్తారా..? లేదా..? అని రైతుల్లో సందేహం నెలకొన్నది. ఇదే విషయమై వ్యవసాయశాఖ అధికారులను అడిగితే వారు నాలుగైదు రోజుల్లో పూర్తి క్లారిటీ వస్తున్నది. అంతవరకు తాము ఏం చెప్పలేం అని సమాధానం ఇస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రోజూ తమకు పంట రుణమాఫీ కాలేదని రైతులు రోడ్డెక్కుతున్నారు. పెద్ద సంఖ్యలో రైతులు తమ నిరసనలు తెలియజేస్తున్నారు. వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు సరిగ్గా లేకపోవడం. ఇతర షరతులతో ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు సంపూర్ణ పంటరుణమాఫీ చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు.
వ్యవసాయశాఖ మండల, జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన గ్రీవెన్ సెల్‌కు వెల్లువలా దరఖాస్తులు వస్తున్నాయి. రెండు రోజులుగా గ్రామాల్లో ఏఈవో, ఏవోల వద్దకు రైతులు క్యూ కడుతున్నారు. ఇదే సమయంలో వ్యవసాయశాఖలో బదిలీలు జరుగుతుండడం తో కొన్నిచోట్ల కార్యాలయాల్లో అధికారులు ఉండడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు రుణమాఫీ కాక, అటు కొత్త రుణాలు రాక ప్రైవేట్ వ్యాపారుల వద్దకు రైతులు పరుగులు తీస్తున్నారు.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు గడపగడపకూ వెళ్తున్నాయి. బుధవారం నుంచి అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమా న్ని చేపట్టారు. ప్రతి గడపకూ వెళ్లి పంట రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తున్నారు. ఒక కుటుంబంలో ఎంతమంది రైతుల పేరిట పంట రుణాలు తీసుకున్నారు. ఎంతమంది రైతులకు పంట రుణమాఫీ జరిగింది. ఇంకా ఎంత మందికి కావాలి.. పంటరుణమాఫీకాక పోవడానికి గల కారణాలు, తదితర అంశాలపై సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్ సెల్‌కు రైతుల నుంచి దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. ఇప్పటివరకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పంట రుణమాఫీ కోసం 11,328 రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో సిద్దిపేట నుంచి 3,142, సంగారెడ్డి నుంచి 4,500, మెదక్ నుంచి 3,686 దరఖాస్తులు వచ్చాయి.