రామాయంపేట, జూన్ 3: తరుగు పేరిట ధాన్యం దోపిడీకి పాల్పడుతున్న కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు మా కొద్దంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్‌లో బుధవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో పీఏసీఎస్ అధ్వర్యంలో రెండు నెలల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ప్రారంభించిన 15 రోజుల తర్వాత ధాన్యం తూకం వేశారు.
రోజుకో లారీ చొప్పున సదరు కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు జిన్న కృష్ణ రైస్‌మిల్లులకు ట్రాక్టర్లు, లారీలను తరలిస్తున్నాడు. ప్రతి లారీకి లోడ్ కాగానే తరుగు పేరిట 10 క్వింటాళ్ల వరకు తీస్తున్నామని రైతులకు చెప్పి బినామీ పేర్ల మీద బిల్లు చేసుకుంటున్నాడు. ఇది గ్రహీంచిన రైతులు చెక్ రిపోర్టు చూడగా అందులో పేర్లు లేకుండానే ధాన్యం బస్తాలు ఉన్నాయి. ఈవిషయం తెలుసుకున్న రైతులు సదరు నిర్వాహకుడు కృష్ణను నిలదీశారు.
సమాధానం సరిగ్గా చెప్పలేదు. ప్రతి లారీకి చేతివాటం ప్రదర్శించి క్వింటాళ్ల కొద్ది ధాన్యం మాయం చేసిన నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని రైతులు మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇంత వరకు ఒక్క అధికారి కూడా ఇటు రాలేదని రైతులు ఆరోపించారు. నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తే మంచిది లేకుంటే రామాయంపేటలోని పీఏసీఎస్ ఎదుట నిరసనకు దిగుతామని హెచ్చరించారు. రామాయంపేట నుంచి పీఏసీఎస్ సీఈవో నర్సింహులు చేరుకుని రికార్డులను పరిశీలించి సదరు నిర్వాహకుడిపై విచారణ చేపడుతున్నాడు.