సిద్దిపేట, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతులకు కష్టాలు తప్పడం లేదు. విత్తనం విత్తిన నాటి నుంచి పంట చేతికొచ్చి అమ్ముకునేదాక కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒక వైపు అకాల వర్షాలు..మరో వైపు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో అరకొర వసతులతో రైతులు సతమతమవుతున్నారు. ఆర్భాటంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు …కానీ ఇంతవరకు ధాన్యం కొనుగోలు చేసింది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక రైతులు కుమిలి పోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై సమగ్ర ప్రణాళిక లేక అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు.
అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొనుగోలు చేయాల్సిన ధాన్యం ఇంత వరకు కొనుగోలు చేయడం లేదు. కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి 20 రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలుకేంద్రం నిర్వాహకులు, మిల్లర్లు, అధికారులు ఇలా ఎవరికి వారు తమ వాదనలు చెబుతున్నారు తప్పా కొనుగోళ్లు ప్రారంభించి రైతుల కష్టాలు తీర్చుదామన్న ద్యాస ఎవరికీ పట్టడం లేదు. జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్, జిల్లా మంత్రులు దామోదర్, పొన్నం ప్రభాకర్ రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, కొనుగోళ్లు, ఎగుమతి, దిగుమతి, కేంద్రాల్లో ఉన్న సమస్యలు తదితర వాటిపై కనీసం సమీక్షలు కూడా నిర్వహించలేదు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు జరగక రైతులు వ్యాపారులకు అడ్డికి పావుశేరు చొప్పున అమ్ముకుంటున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,116 కొనుగోలు కేంద్రాల ద్వారా 11.73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సిద్దిపేట జిల్లాలో 439 కొనుగోలు కేంద్రాల నుంచి 5.03 లక్షల మెట్రిక్ టన్నులు, మెదక్ జిల్లాలో 470 కేంద్రాల ద్వారా 3.80 లక్షల మెట్రిక్ టన్నులు, సంగారెడ్డి జిల్లాలో 207 కొనుగోలు కేంద్రాల ద్వారా 2.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నారు.ఉమ్మడి జిల్లాలో మొత్తంగా 40 నుంచి 45 వేల మెట్రిక్ టన్నుల సన్నాలు కొనుగోలు చేయాలని లక్ష్యం. లక్ష్యాలు బాగానే ఉన్నా క్షేత్ర స్థాయిలో అందు కు విరుద్ధంగా ఉంది.
ఎక్కడ కొనుగోలు జరగక పోవడంతో రైతులు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు.కొనుగోలు కేంద్రాలను అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ప్రారంభించి వెంట వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి కానీ అలా చేయడం లేదు. ఆర్భాటాలకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు కానీ ధాన్యం కొనుగోలు చేయడం విస్మరించారు. దీంతో కేంద్రాల వద్దనే రైతులు పడిగాపులు కాయాల్సి వస్తుంది. కేంద్రం నిర్వాహకులు తూకాలు వేయడం లేదు. రైస్ మిల్లులు అలాట్ కాలేదు అని సమాధానాలు చెబుతున్నారు. ఇటు రైస్ మిల్లుల వాళ్ల దగ్గర గతంలో తీసుకున్న ధాన్యం నిల్వలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం వచ్చే ధాన్యం ఎక్కడ పెట్టుకోవాలి అని చెబుతున్నారు.
వసతుల కల్పన అంతంతమాత్రమే అని చెప్పాలి. అకాల వర్షాలు వస్తే ధాన్యం తడిస్తే ఎవరు బాధ్యులు.ప్యాడీక్లీనర్, తూకం, తేమ యంత్రాలు, గన్నీ బస్తాలు తదితర సామగ్రి అందుబాటులో లేదు. ఆయా కేంద్రాల్లో ధాన్యం తూకం వేసిన బస్తాలకు రక్షణ కరువైందని చెప్పాలి. గతంలో సరఫరా చేసిన టార్పాలిన్ కవర్లు పూర్తిగా చినిగిపోయాయి. కొత్తగా ఒక్క కవరు కూడా రావడం లేదు. వర్షం వస్తే ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవుతుంది.కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడిస్తే దానికి పూర్తి బాధ్యత నిర్వాహకులేదే.. కానీ వారు బాధ్యత తీసుకోవడం లేదు. కేంద్రాల్లో కనీస వసతులు కూడా ఉండడం లేదు.మట్టి కల్లాలు కావడంతో వర్షాలు కురిసిన సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు. కనీసం రైతులు సేద తీరడానికి షెడ్లు కూడా లేవు. తాగునీటి వసతి కూడా ఏర్పాటు చేయడం లేదని రైతులు వాపోతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. కేంద్రాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయక పోవడంతో రైతులు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రైస్‌మిల్లుల యజమానులు తమ ఏజెంట్లను పెట్టుకొని కొనుగోలు చేస్తున్నారు.జిల్లాలోని రైస్‌మిల్లర్లే కాక ఇతర రాష్ర్టాల వ్యాపారులు సైతం వచ్చి వారం రోజుల వాయిదాలు పెట్టి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రైస్ మిల్లర్లు తమ ఏజెంట్ల ద్వారా పచ్చి ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయిస్తున్నారు.క్వింటాల్‌కు రూ1,800 నుంచి రూ. 2 వేల మధ్య ధాన్యం కొనుగోలు చేయిస్తున్నారు.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం ఏ గ్రేడ్‌కు రూ. 2,386 మద్దతు ధర, సన్నాలకు క్వింటాల్‌కు అదనంగా మరో రూ. 500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.కానీ ఇంత వరకు గత యాసంగి సన్నాలకు ఇవ్వాల్సిన బోనస్ పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రభుత్వం చెప్పే మాటలను రైతులు పరిగణలోకి తీసుకోవడం లేదు.కాంగ్రెస్ సర్కార్ మాటల వరకే…రైతులకు ఇవ్వాల్సిన బోనస్ ఎగ్గొట్టిందని మండి పడుతున్నారు.అటు ప్రభుత్వం మద్దతు ధర లభించక ..ఇటు చేతిలో డబ్బులు లేక రైతులు తమ ధాన్యాన్ని వ్యాపారులకు అమ్ముకుంటున్నా రు. దీనిని ఆసరాగా చేసుకొని వ్యాపారులు రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారు.