మెదక్, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. విద్యుత్ కార్యాలయాల చుట్టు తిరిగినా కనెక్షన్ మంజూరు కావడం లేదు. మెదక్ జిల్లాలో రైతులు ఎక్కువగా బోరు,బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. కొత్త వ్యవసాయ కనెక్షన్ల కోసం డీడీలు చెల్లించినా, విద్యుత్‌శాఖ అధికారులు నెలల తరబడి కనెక్షన్లు మంజూరు చేయడం లేదు. మెదక్ జిల్లాలో కొత్తగా వ్యవసాయ కనెక్షన్ల కోసం 3200 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. దీనికోసం ట్రాన్స్‌కోకు డీడీలు చెల్లించి నెలల గడుస్తున్నది. ఇప్పుటి వరకు జిల్లాలో 1.20 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. మెదక్, తూప్రాన్ ట్రాన్స్‌కో సబ్ డివిజన్లు ఉన్నాయి. 132/11 కేవీ సబ్స్టేషన్లు 11, 220/132 కేవీ సబ్స్టేషన్లు 3, 33/11కేవీ సబ్స్టేషన్లు 131 ఉన్నాయి. తూప్రాన్, నర్సాపూర్, మెదక్, రామాయంపేట, పాపన్నపేటలో ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతు కేంద్రాలు ఉన్నాయి. జూలైలో అధిక విద్యుత్ వినియోగంతో 130 వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి.
విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న లైన్మెన్లు, ప్రైవేట్ వ్యక్తులను మధ్యవర్తులుగా నియమించుకొని కనెక్షన్ల కోసం భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది. కొన్ని మండలాల్లో మధ్యవర్తుల ద్వారా వెళ్తే పనులు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్‌కోకు డబ్బులు చెల్లించినా, కొత్త కనెక్షన్ మంజూరు కోసం అదనంగా డబ్బులు ఇస్తేనే పనులు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు దరఖాస్తు చేసుకున్న వెంటనే విద్యుత్‌శాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలి. కానీ, ఎక్కడా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించడం లేదు. విద్యుత్‌శాఖలో అధికారులు గృహ, వ్యవసాయ, వాణిజ్య కనెక్షన్ల మంజూరు కోసం భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అర్హులైన రైతులను పక్కనపెట్టి డబ్బులు ఇచ్చిన వారికి ముందుగానే కనెక్షన్లు మంజూరు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ మార్పు, కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, లైన్ పొడిగింపు కోసం డబ్బులు ఇవ్వకపోతే పనులు చేయడం లేదనే రైతులు ఆరోపిస్తున్నారు.
రైతులు వ్యవసాయ కనెక్షన్ కోసం ట్రాన్స్‌కోకు డీడీలు చెల్లించిన వెంటనే విద్యుత్ సామగ్రి అందించాలి. రైతు రూ.9200 కనెక్షన్ కోసం డీడీలు ట్రాన్స్‌కోకు చెల్లించిన వెంటనే సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ శాఖనే కండక్టర్ సమకూర్చి అవసరమైన స్తంభాలు ఏర్పాటు చేసి కనెక్షన్ ఇవ్వాలి. మూడు కనెక్షన్లకు రైతు మూడు డీడీలు చెల్లిస్తే, ఆ రైతుకు కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలి. సమీపంలో ఉన్న వ్యవసాయ ఫీడర్ నుంచి కొత్త ట్రాన్స్ఫార్మర్ వరకు అవసరమైన స్తంభాలు, కండక్టర్ వైర్లు, రూ. 2లక్షల విలువైన సామగ్రి అందించాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులకు ఉచితంగా కనెక్షన్ ఇవ్వాల్సి ఉన్నా, అధికారులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. బోరు,బావుల తవ్వకాలు పెరిగి కొత్త కనెక్షన్లు, అదనపు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల కోసం భారీగా డిమాండ్ పెరిగింది. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని ట్రాన్స్‌కో అధికారులు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
మెదక్ జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లు సీనియారిటీ ప్రకారం మంజూరు చేస్తాం. రైతులు డీడీలు చెల్లించిన వెంటనే క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది సర్వే చేస్తారు. మెదక్ జిల్లాలో 32 00 వ్యవసాయ కనెక్షన్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని సీనియారిటీ ప్రకారం మంజూరు చేస్తాం. కొత్త కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు ,వైర్ల కోసం ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయాలి. విచారణ చేసి డబ్బు లు డిమాండ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
-ఎస్.నారాయణ నాయక్, మెదక్ సర్కిల్,
సూపరింటెండెంట్ ఇంజినీరు (మెదక్ జిల్లా)