అక్కన్నపేట, నవంబర్ 14: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం చౌటపల్లి స్టేజీ వద్ద ఇండస్ట్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. బంగారు పంటలు పండే తమ భూములు ఇండస్ట్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ఇచ్చేది లేదని రైతులు ఖరాఖండీగా చెబుతున్నారు. ఈనెల 7న రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్, టీఎస్ఐఐసీ ఎండీ విష్ణువర్థన్‌రెడ్డి, ఇతర అధికారులతో కలిసి ఇండస్ట్ట్రియల్ పార్కు ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు.
మరుసటి రోజు నుంచి 312 సర్వేనంబర్‌లోని సుమారు 140 మంది రైతులు ఆందోళనలకు దిగారు. హుస్నాబాద్ డివిజన్ కార్యాలయం, అక్కన్నపేట తహసీల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సర్వేకు వచ్చిన రెవెన్యూ అధికారులను సర్వే చేయకుండా రైతులు అడ్డుకున్నారు. కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చౌటపల్లికి పరామర్శకు రాగా, బాధిత రైతులు ఆయనను కలిసి ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని, ఈ విషయంలో తమకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేసి వినతి పత్రం అందజేశారు. ఇండస్ట్ట్రియల్ పార్కు ఏర్పాటుకు తాము భూములు ఇవ్వమని ఇటీవల కలెక్టరేట్లో కలెక్టర్‌ను రైతులు, అఖిలపక్ష నాయకులు కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్న పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఇండస్ట్ట్రియల్ పార్కు ఏర్పాటుకు అవసరమయ్యే భూసేకరణపై దృష్టిసారించారు. దీనికోసం అంతర్గతంగా నివేదికను తయారు చేస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా చౌటపల్లిలో ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 312లో 85.13 ఎకరాలను గుర్తించారు. జనగామ శివారు పట్టా భూములు సర్వే నంబర్ 73, 74, 75, 76, 77, 78, 79, 812, 813, 814, 815లో 23 ఎకరాలు, తోటపల్లి శివారులోని సర్వే నంబర్ పట్టాభూములు 478, 479, 480తో పాటు కొంత ప్రభుత్వ భూమి 20 ఎకరాల వరకు, మొత్తంగా ఇండస్ట్ట్రియల్ పార్కు కోసం 128.38 ఎకరాల భూమిని సేకరించారు.
ఇందుకు సంబంధించిన హద్దులు, మ్యాపులు, నివేదికలు, ఇతరత్రా వివరాలతో కూడిన జాబితాను సిద్ధం చేస్తున్నారు. అక్కన్నపేట మండలం చౌటపల్లి, జనగామ, హుస్నాబాద్ మండలం తోటపల్లి సరిహద్దులను కలుపుతూ ఇండస్ట్ట్రియల్ పార్కు ఏర్పాటయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇండస్ట్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం చౌటపల్లిలోని వేంకుంటలో కొంత భాగం పూడ్చివేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. రోడ్డు వైపున నిర్మాణం చేసిన పెద్దమ్మతల్లి దేవాలయం, డంపింగ్‌యార్డు, క్రీడాప్రాంగణం, రోడ్లు, మంచినీటి బావి, చిరు దుకాణాలు తొలిగించాల్సి వస్తుంది.
ఇండస్ట్ట్రియల్ పార్కు ఏర్పాటుతో భూములు కోల్పోతున్న రైతులు, గ్రామ అఖిల పక్ష నాయకులు ఇటీవల హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. చౌటపల్లి స్టేజీ వద్ద ఇండస్ట్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయవద్దని కోరారు. ఇండస్ట్ట్రియల్ పార్కు ఏర్పాటుతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, భూములు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ సర్ది చెప్పినట్లు తెలిసింది.
తాత్తముత్తాల నుంచి ఇక్కడ భూమిని సాగు చేసుకుంటున్నాం. ఎనుకట ఈ ఎకరం ప్రభుత్వ భూమి వచ్చింది. ఈ భూమిపై ఆధారపడి బతుకుతున్నం. ఇప్పుడేమో ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటే ప్రాణం పోతున్నది. మొన్న సార్లూ సర్వేకు వస్తే బాగా లొల్లి పెట్టినం. మా భూములు మాకే అంటూ సర్వేలేదూ, ఏమి లేదూ పొండి అంటూ వెనక్కి పంపినం. ఇక్కడ సర్కారు పెట్టే కంపెనీలు ఏం వద్దు. మా బతుకులు మేం బతుకుతాం.
– చంచు ముత్తయ్య, రైతు, చౌటపల్లి
గ్రామ సర్వే నంబర్ 312లో మానాన్న లక్ష్మణ్ పేరిట భూమి ఉంది. అప్పుడు అందరికీ లావణీ పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్కు పేరిట భూములను లాక్కోవడం సరికాదు. ఈ సర్వేనంబర్‌లో 147 మంది రైతులకు ఐదు గుంటల నుంచి ఎకరంన్నర వరకు భూమి ఉంది. అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులందరం కలిసి ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాడుతాం.
-చంచు రంజిత్, రైతు, చౌటపల్లి
ఏన్నో ఏండ్ల నుంచి భూములను నమ్మకొని బతుకుతున్నం. ఇప్పుడేమో గీ సర్కారోళ్లు వచ్చి ప్రభుత్వ భూములను ఇండస్ట్ట్రియల్ పార్కు కోసం తీసుకుంటం అంటుండ్రు. సర్వే చేస్తామని చెప్పడంతో ప్రాణాలు పోయినంత పని అయ్యింది. గీ భూములు పోతే మాకు చావే శరణ్యం. అక్కన్నపేట మండల కేంద్రంలో ఎలాంటి అభ్యంతరాలు లేని వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ ఇండస్ట్ట్రియల్ పెడితే అందరికీ అనుకూలంగా ఉంటది.
-బొడమల్ల సంపత్, రైతు, చౌటపల్లి