మెదక్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట గురువారం బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన రైతు మహాధర్నా విజయవంతమైంది. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. వేలాదిగా తరలివచ్చిన రైతులతో ధర్నా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. బీఆర్ఎస్ మెదక్ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శశిధర్‌రెడ్డి, క్రాంతికిరణ్, బీఆర్ఎస్ నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డిలతో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఈ మహాధర్నాకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి హాజరయ్యారు. రైతు మహాధర్నాలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ…కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, ఎకరానికి రూ.15వేలు, రైతు భరోసా, వరి ధాన్యానికి రూ.500 బోనస్ అంటూ బోగస్ మాటలు చెప్పిన మోసకారి సీఎం రేవంత్‌రెడ్డి అని అన్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా రైతు ఆత్మ హత్యలే జరుగుతున్నాయని గుర్తు చేశారు.
పదకొండు సార్లు రూ.72వేల కోట్లతో రైతు బంధును అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు భరోసా ఇవ్వదని ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఇక భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీనే రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుందని, సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని ఆయన పేరొన్నారు. ఈ ధర్నా రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం మాత్రమే కాకుండా, రైతుల కోసం తాము ఎంతగానో పనిచేస్తున్నామనే సందేశాన్ని ప్రజలకు అందించడమేనని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు.
మహాధర్నాకు వేలాదిగా తరలివచ్చిన రైతులు…
మెదక్ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన బీఆర్ఎస్ మహాధర్నాకు జిల్లా నుంచి వేలాదిగా రైతులు తరలివచ్చారు. రెండు రోజులుగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్గౌడ్తో పాటు బీఆర్ఎస్ నాయకులు పర్యవేక్షించారు.