గుమ్మడిదల, మార్చి 8: ప్యారానగర్ డంపింగ్‌యార్డు రద్దు చేయాలని 32రోజులుగా ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వానికి చెవులు వినిపిస్తలేవా.. కండ్లు కనిపిస్తలేవా..? మా బాధలు పట్టవా అని రైతు మహిళా సంఘాల సభ్యులు ధ్వజమెత్తారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లిలోని ప్యారానగర్ అటవీ ప్రాంతంలో డంపింగ్‌యార్డు ఏర్పా టు పనులు ఆపాలని డిమాండ్ చేస్తూ గుమ్మడిదల బల్దియాలో, నల్లవల్లి, కొత్తపల్లిలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. శనివారానికి దీక్షలు 32వ రోజుకు చేరుకున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రిలే నిరాహార దీక్షలో రైతు, మహిళా సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రైతు జేఏసీ అధ్యక్షురాలు ఇందుల మల్లమ్మ, రైతు జేఏసీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు.
డంపింగ్‌యార్డు ఏర్పాటుతో మా బతుకులు నాశనమవుతాయి. కాలుష్యం బారినపడ తాం. ఎవుసం కుంటుపడే ప్రమాదం ఉంది. ఎవుసాన్నే నమ్ముకున్న మాకు ఉపాధి కోల్పోయి వలసపోవాల్సి వస్తుంది. పర్యావరణాన్ని, మా పిల్లల భవిష్యత్ కాపాడుకోవడానికి డంప్‌యార్డు ఇక్కడ్నుంచి తరలించా లి. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తాం.
– పద్మ, గుమ్మడిదల రైతు జేఏసీ మహిళా సభ్యురాలు
డంపింగ్‌యార్డు ఏర్పాటుతో అన్ని విధాలా మా ప్రాంతానికి నష్టం జరుగుతుంది. డంపింగ్‌యార్డు వద్ద 13 గ్రామపంచాయతీల ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసినం. అయినా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వం డంపుయార్డు పనులు వెంటనే ఆపాలి.
– రేణుకారెడ్డి, రైతు జేఏసీ సభ్యురాలు, గుమ్మడిదల
గుమ్మడిదల, చుట్టుపక్కల గ్రామాలతో పాటు వెల్దుర్తి, శివంపేట, నర్సాపూర్ వంటి మండలాల భూగర్భ జలాలు కలుషితమై ఎవుసం కుంటుపడే ప్రమాదం ఉంది. డంపింగ్‌యార్డు ఏర్పాటైతే ఎవుసం చేయలేము. దీనివల్ల ఎవుసం పనులు దొరకవు. ప్రభుత్వం మా పొట్టకొట్టే పని చేయవద్దని కోరుతున్నాం.
– ఇందుల మల్లమ్మ, రైతు జేఏసీ అధ్యక్షురాలు, గుమ్మడిదల