గుమ్మడిదల, జూలై 7 : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని ప్యారానగర్ డంపింగ్ యార్డును రద్దు చేయాలని కోరుతూ చేస్తున్న రైతు జేఏసీ నాయకుల ఆందోళనలు ఉధృతమయ్యాయి. డంపింగ్‌యార్డును క్షేత్రస్థాయిలో గ్రీన్ ట్రిబ్యునల్ అధికారులు పరిశీలించనున్నారన్న సమాచారంతో గుమ్మడిదల మండలంలోని అన్ని గ్రామాల రైతులు, జేఏసీ నాయకులు, అఖిలపక్ష పార్టీల నాయకులు నల్లవల్లిలో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరానికి చేరుకుని ఆందోళనకారులకు సంఘీభావం తెలిపారు. అనంతరం నల్లవల్లి జాతీయరహదారి పక్కన డంపింగ్‌యార్డును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా ధర్నా చేశారు.
గ్రీన్ ట్రిబ్యునల్ అధికారులు రావడం లేదని సమాచారం తెలియడంతో అసహనానికి గురయ్యారు. ఈ సందర్భంగా రైతు జేఏసీ నాయకులు మాట్లాడుతూ డంపింగ్ యార్డును రద్దు చేసే వరకు ఆందోళన విరమించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డంపింగ్‌యార్డు కో హఠావో అంటూ నినాదాలు చేశారు. 153 రోజులుగా దీక్ష చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు జేఏసీ నాయకులు, పలు పార్టీల నాయకులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.