పటాన్చెరు రూరల్, జూన్ 24: నమస్తే తెలంగాణ దినపత్రికలో ఈ నెల 18వతేదీన వచ్చిన పటాన్చెరు డివిజన్‌కు రైతు భరోసా బంద్ అనే కథనం పటాన్చెరు నియోజకవర్గంలో అగ్గిరాజేసింది. నాలుగు మండలాల రైతులకు రైతు భరోసా ప్రభుత్వం వేయలేదని అన్ని పార్టీలు రైతులకు జరిగిన అన్యాయాన్ని గుర్తించాయి. అధికార పార్టీ నేతలు ప్రభుత్వానికి లెటర్ రాయడం, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చారు. మాజీ మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డి జిల్లా జిన్నారంలో పెద్ద ఎత్తున రైతులతో ధర్నా నిర్వహించి సర్కార్‌కు రైతు భరోసా వేయాలని, లేదంటే రింగ్‌రోడ్డును దిగ్బంధిస్తామని హెచ్చరించారు.
పార్టీలకతీతంగా ఉద్యమించడంతో ప్రభుత్వం స్పందించి జరిగిన తప్పును గుర్తించింది. మంగళవారం రైతుల అకౌంట్లలో ప్రభు త్వం రైతు భరోసా డబ్బులు జమచేయడంతో మెసేజ్‌లు వచ్చాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పటాన్చెరు డివిజన్లోని జిన్నారం, పటాన్చెరు, రామచం ద్రాపురం, అమీన్ఫూర్లోని రైతులు 27వేల 120మందికి రూ. 12కోట్ల 99లక్షల రైతు భరోసా నిధులు వేయలేదని తెలిపింది. నగరంతో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని మండలాలు జీహెచ్ఎంసీలో ఉన్నాయని, పట్టణీకరణకు గురయ్యాయని, వ్యవసాయం చేయడంలేదని చెబుతూ ప్రభుత్వం పటాన్చెరు డివిజన్లోని రైతుల అకౌంట్లలో డబ్బులు వేయలేదు.
హరీశ్‌రావు హెచ్చరికలతో ప్రకంపనలు
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సంగారెడ్డి జిల్లా జిన్నారంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులతో నిర్వహించిన మహాధర్నాలో పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీశారు. నగరం, నగర శివారులోని రైతులు ఏమి అన్యాయం చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు వేయని పక్షంలో 20వేల మంది రైతులతో రింగురోడ్డుపై ఆందోళన చేస్తామని హెచ్చరిండంతో సర్కారు దిగి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసింది.