చిన్నశంకరంపేట, ఫిబ్రవరి 3: యూరియా కోసం రైతులు పాట్లు పడుతున్నారు. మెదక్ జిల్లా గవ్వలపల్లి చౌరస్తాలోని మెదక్- చేగుంట ప్రధాన రహదారిపై మంగళవారం ఉదయం రైతులు రాస్తారోకో చేశారు. రైతు వేదిక వద్దకు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యాప్లో యూరియా బుక్ కాక రైతులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యూరియా కొరత లేకుండా సులువుగా లభించిందని వాపోయారు. కాంగ్రెస్ హయాంలో యూరియా కోసం పనులన్నీ వదులుకొని గంటల తరబడి క్యూలో ఉండే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ బుకింగ్ ద్వారా కొనుగోలు చేయడం కష్టంగా మారిందన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఏవో లక్ష్మీప్రవీణ్, ఎస్సై నారాయణ రైతులను సముదాయించి రాస్తారోకోను విరమింపజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై రైతులు శాపనార్థాలు పెట్టారు. సరైన కరెంట్, రైతుబంధు లేదు, సమయానికి యూరియా సరఫరా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు ఓటు వేసి తప్పు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు వేదిక వద్ద క్యూలో ఉన్న రైతులు ఆగ్రహానికి గురై కిటికీ అద్దాలు పగులగొట్టారు. యాప్ ద్వారా యూరియా బుకింగ్ రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.