చేర్యాల, మే 5: సిద్దిపేట జిల్లా చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అందుబాటులో ప్యాడీ క్లీనర్లు లేక ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించి ప్రైవేట్ వ్యక్తులు ప్యాడీ క్లీనర్ల అద్దె పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. దీనికితోడు కొనుగోలు కేం ద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో లేక అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతున్నది.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని కేంద్రాల్లో తరుగు పేరిట 50కిలోల బస్తా నుంచి 2కిలోల ధాన్యాన్ని తీస్తుండడంతో రైతులు నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించిన తర్వాత మిల్లులకు తరలించేవరకూ రైతులే బాధ్యత తీసుకోవాలని ఆంక్షలు పెడుతున్నారు. కొంత మంది మిల్లర్లు ధాన్యం సరిగ్గా లేదని గింజ పొడవు, చిన్నదిగా ఉన్నదని కుంటిసాకులు చెబుతూ ధాన్యం లారీల లోడులను వెనక్కి పంపిస్తున్నారు.
దీంతో చేసేదేమీలేక రైతులు మిల్లర్లు పెట్టిన ఆంక్షలకు తలొగ్గి ధాన్యాన్ని విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. తీరా ధాన్యాన్ని అమ్మిన రైతులకు 48 గంటల్లో బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయని ప్రభుత్వం చెబుతుండగా 15రోజులైనా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్నధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనేక ఆంక్షలు పెడుతుండడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో అనేక సమస్యల మధ్య రైతులు ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది.