వడ్ల కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో లారీలు అందుబాటులో లేక ధాన్యం మిల్లులకు తరలించడం ఇబ్బందిగా మారుతున్నది. రైతులు లారీల కోసం రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో వేచిచూసే పరిస్థితి నెలకొంది. వడ్లు నింపేందుకు గన్నీ బస్తాలు లేక రైతులు కుప్పులుగా పోసి ఉంచారు. ధాన్యం తూకం వేసిన లారీలు రాకపోవడంతో కాంటా అయిన వడ్ల బస్తాల వద్ద రైతులు కాపలా ఉంటున్నారు. వడ్లు అమ్ముకోవడానికి ఎన్నడూ ఇన్ని ఇబ్బందులు పడలేదని మెదక్ జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీలు, గన్నీ బ్యాగుల కొరత రైతలను వేధిస్తున్నది. వడ్ల కాంటాకు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నది.
మెదక్, మే 22(నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో యాసంగిలో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనాలని యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పుటి వరకు 37,072 మంది రైతుల నుంచి 1,85,688 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్ర మే కొనుగోలు చేశారు. వడ్లు అమ్మిన 26,191 మంది రైతుల బ్యాంకు ఖాతా ల్లో రూ. 260.03 కోట్ల డబ్బులు వేసినట్లు అధికారులు తెలిపారు. గన్నీ బ్యాగులు అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ధాన్యం బస్తాలు తూకం వేసి మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నా, లారీలు సకాలంలో రావడం లేదు. మెదక్ జిల్లాలో రైతులు 4270.040 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కలిపించకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. తాగునీరు,నీడ, గన్నీబ్యాగులకు రైతులు ఇబ్బంది పడుతున్నారు.
మెదక్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల రైస్‌మిల్లులు 80 వరకు ఉన్నాయి. లారీల కాంట్రాక్టు వారికే ఇవ్వడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మెదక్ జిల్లాలో వడ్లు తరలించేందుకు 1000 లారీలు అవసరం ఉండగా, 600 లారీలు అందుబాటులో ఉన్నాయి. ధాన్యం బస్తాలు మిల్లులకు తరలించేందుకు రైతుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నా, అధికారులు లారీ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడం లేదు.
లారీల కాంట్రాక్టర్లు ప్రతిరోజు పౌరసఫరాల శాఖ జిల్లా కార్యాలయంలో ఉండి అధికారులకు రాచమర్యాదలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మెదక్ జిల్లాలో ఎక్కువ రైస్‌మిల్లులు రాజకీయ నాయకులకు చెందినవి కావడంతో అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నట్లు తెలిసింది. ధాన్యం బస్తాలు మిల్లులకు తరలించేందుకు కొనుగోలు కేంద్రాలకు లారీలు సకాలంలో రాకపోవడంతో కుప్పులుగా ధాన్యం పేరుకుపోయింది. రైతులు అక్కడే రోజుల తరబడి ఉండాల్సి వస్తున్నది. అకాల వర్షాలకు వడ్లు తడిసిపోయి రైతులకు నష్టం జరుగుతున్నది.
కేసీఆర్ పాలనలో వడ్లు అమ్ముకోవడానికి ఇన్ని కష్టాలు ఉండేవి కావు అని రైతులు గుర్తుచేస్తున్నారు. వరి కోతల సమయంలోనే గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతుల నుంచి ధాన్యం తూకం వేసి మిల్లులకు తరలించేవారు. తూకంలో తరుగు పేరిట మోసం చేస్తే ప్రభుత్వం అప్పట్లో కఠినంగా వ్యవహరించింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా రెండు, మూడు కిలోలు తరుగు పేరిట తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
ధాన్యం అమ్మిన రెండు, మూడు రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ప్రభుత్వం జమచేసేది. గన్నీ బస్తాలు, ప్యాడీక్లీనర్లు, లారీల సమస్య ఉండేది కాదు. ప్రణాళికతో బీఆర్ఎస్ ప్రభుత్వం వడ్లు సేకరించింది. మంత్రులు తరుచూ అధికారులతో సమీక్షలు నిర్వహించి, సజావుగా ధాన్యం కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో రైతులు తిప్పలు పడుతున్నారు.
వడ్లు పండించి అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేవు. వర్షం పడితే ధాన్యం తడిసిపోతున్నది. తడిసిపోయిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేయకపోవడంతో ఎండలో ఆరబోస్తున్నాం. గన్నీ బస్తాలు ఉండడం లేదు. లారీలు సకాలంలో అస్తలేవు. లారీల సమస్య అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. లారీల సమస్య తీవ్రంగా ఉంది. అదనంగా డబ్బులు ఇవ్వాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. గింత గోస ఎన్నడూ చూడలేదు. – నిమ్మగళ్ల దుర్గమ్మ, రైతు, కొల్చారం (మెదక్ జిల్లా)
తూకం వేసిన వడ్లు తరలించేందుకు లారీలు రాకపోవడంతో రాత్రి,పగలు బస్తాల వద్ద కాపాలా ఉంటున్నాం. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తూకం చేసినా లారీలు రావడం లేదు. గన్నీ బస్తాలు లేకపోవడంతో రెండు రోజులు తూకం వేయలేదు. ధాన్యం కొనుగోలు చేసినా లారీలు రావడం లేదు.లారీలు రాకపోడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ ఉంటున్నది. ధాన్యం మిల్లులకు తరలించేందుకు లారీలకు ఎక్కువ డబ్బులు అడుగుతుండ్రు. వడ్లు పండించిన రైతులకు నష్టం తప్ప లాభం లేదు.
– మంగలి భూమమ్మ, రైతు, కొల్చారం (మెదక్ జిల్లా)