Monsoon Rains : ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు కనిపిస్తోంది. అయితే, వానాకాలంలో భారీ వర్షాలు నమోదయ్యేది ఆగష్టులోనే. అందుకే ఈ నెలలో కూడా దేశంలో భారీ వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాతావరణం వర్షాలకు అనుకూలంగా ఉందని యురోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌క్యాస్ట్స్ (ఈసీఎండబ్ల్యూఎఫ్) సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ అంచనా ప్రకారం వచ్చే 15 రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో తగినంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
ముఖ్యంగా సెంట్రల్ ఇండియాతోపాటు దేశంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతాన్ని ఈ సీజన్ రెయిన్ ఫ్యాక్టరీ అంటారు. ఈ కాలంలో వర్షాలకు కారణమయ్యేది ఇదే. దీనికి అనుగుణంగా ప్రస్తుతం అనేక అల్పపీడన వ్యవస్తలు బంగాళాఖాతంలో భారీ సంఖ్యలో, ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడుతున్నాయి. వీటివల్లే దేశంలో వర్షాలకు ఛాన్స్ ఉంది. ఈ అల్పపీడన వ్యవస్థలు మెల్లిగా దేశంలోకి కదులుతాయి. వీటివల్ల ఇప్పటికే ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌తోపాటు ఈశాన్య భారతదేశంలో తేమ శాతం పెరిగింది.
ఈ కారణంగా ఆగష్టు చివరివారం వరకు వర్షాలకు ఛాన్స్ ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఎల్‌నినో కారణంగా దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్తితులు ఏర్పడ్డాయి. దీంతో అనేక చోట్ల కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. అందువల్ల బంగాళాఖాతంలో ఏర్పడ్డ వ్యవస్తల వల్ల వర్షాలు కురిస్తే, పరిస్తితుల్లో మార్పు రావొచ్చు. వర్షపు లోటు తగ్గవచ్చు.