సిద్దిపేట, మే 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నత్తనడకన వడ్ల కొనుగోళ్లు జరుగుతుండడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడ్లు తెచ్చి నెలరోజులవుతున్నా కొనుగోలు కేంద్రాల్లో కాంటా కావడం లేదు. రోజుల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 20శాతం వడ్లు మాత్రమే కొన్నారు. వారం రోజుల్లో రోహిణి కార్తె వస్తుంది. వానకాలం సాగు పనులు ప్రారంభమవుతాయి.కానీ, ధాన్యం సేకరణలో ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదు. చాలాచోట్ల కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావద్దని ఫ్ల్లెక్సీలు ఏర్పాటు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
టోకెన్ తీసుకున్నాక 20 రోజులకు లైన్ రావడం లేదని రైతులు చెబుతున్నారు. కొనుగోళ్లలో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కుతున్నారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకోల్లో పాల్గొంటునానరు. ఏ కొనుగోలు కేంద్రం చూసినా వడ్ల రాశులతో నిండిపోయి ఉంది. కొనుగోలు సరిగ్గా జరగడం లేదు. లారీలు రావడం లేదు. దీంతో రైతులు కేంద్రాల వద్దే ఉండిపోతున్నారు. అధికారులు కాలం వెళ్లదీస్తున్నారు. కొందరు రైతులు రాత్రిళ్లు ధాన్యం వద్దే పడుకుంటున్నారు.తినడానికి సరైన భోజనం లేదు. తాగడానికి మంచినీళ్లు కూడా లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రకృతి విపత్తులు..ఇటు ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతు నలిగిపోతున్నాడు.
యాసంగిలో సిద్దిపేట జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 17వేల రైతుల నుంచి 1,01,000 మెట్రిక్ వడ్లు సేకరించి పేమెంట్ కోసం జనరేట్ చేశారు. 8 వేల మంది రైతుల ఖాతాల్లో పేమెంట్ జమచేశారు. హమాలీ చార్జీ కింద 40 కిలోల బస్తాకు రూ. 23 నుంచి రూ.25 వరకు తీసుకుంటున్నారు. ట్రాక్టర్ దిగుమతి కింద బస్తాకు అదనంగా రూ. 5 తీసుకుంటున్నారు. ఇవన్నీ రైతు భరించాల్సి వస్తున్నది. మొక్కజొన్నకు గోనె సంచులు రైతులే కోనుక్కోవాల్సి వస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో ప్రతి బస్తాపై అదనపు కిలోలు కట్ చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు. ధాన్యం బస్తా బరువులో గన్నీ సంచి, తేమ, ధూళి వంటి అంశాలను చూపిస్తూ కొంత బరువును తగ్గిస్తున్నారు. ఒకో బస్తాకు కిలో నుంచి 2 కిలోల వరకు అదనంగా కట్ చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. తరుగుపై రైతులు ప్రశ్నిస్తే అంతే అని సమాధానం ఇస్తున్నారు.
విత్తు విత్తిన నాటి నుంచి పంట అమ్ముకునే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ధాన్యం అమ్ముకోవడానికి రోజుల తరబడి కేంద్రాల వద్దనే పడిగాపులు కాయాల్సి వస్తున్నది. చినిగిపోయిన గన్నీ బ్యాగులు పంపడంతో రైతులు కుట్లు వేసి ధాన్యం నింపుతున్నారు. ఒక్కో సంచి నుంచి ధాన్యం పోవడంతో తరుగు పేరిట కోతలు విధిస్తున్నారు. కేంద్రాల్లో సరిపడా ప్యాడీ క్లీనర్లు లేక రైతులు ప్రైవేట్ వ్యక్తుల వద్ద కిరాయికి యంత్రాలు తెచ్చి వడ్లు తూర్పార పడుతున్నారు. ఒక్క ట్రాక్టర్ తూర్పార పడితే రూ. 500 నుంచి రూ.800 వరకు చెల్లించాల్సి వస్తున్నది. తూర్పార పట్టే మిషన్ సంచులు నింపే దానికి ట్రాక్టర్ ట్రిప్ వడ్లకు రూ. 1000 తీసుకుంటున్నారు. టార్పాలిన్లు ఇవ్వక పోవడంతో అకాల వర్షాలకు వడ్లు తడిసి ముద్దవుతున్నాయి. కొనుగోలు కేంద్రంలో వడ్లు అమ్మడానికి రైతులు 15 రోజులు వరకు నిరీక్షణ తప్పడం లేదు. ధాన్యం అమ్మి పది రోజులు దాటినా పైసలు రావడం లేదు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో దళారులు రాజ్యం నడుస్తోంది. వీరిని అరికట్టాల్సిన అధికారులే వారికి వంత పాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అకాల వర్షాలు కురుస్తుండడంతో ధాన్యం దెబ్బతింటుందని రైతులు తక్కువ ధరకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. వ్యాపారులు కొనుగోల కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కై ఆ ధాన్యం గుట్టుచప్పుడు కాకుండా కాంటా చేయించి, లారీల్లో లోడ్ చేయించి పంపి సొమ్ముచేసుకుంటున్నారు. క్వింటాల్‌కు రూ. 400 నుండి రూ. 500 వరకు లాభం పొందుతున్నారు. ఇలా వచ్చిన డబ్బులతో నిర్వాహకులకు కొంతమేర దళారులు అప్పజెప్పుతున్నారు. రైతులకు అకాల వర్షాలు, వడగళ్ల వాన తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. కేంద్రాల్లో ఆరుబయట ఉన్న ధాన్యం తడిసి నాణ్యత కోల్పోతోంది. ధాన్యం రంగు మారడంతో మిల్లర్లు తిరసరించే పరిస్థితి ఏర్పడుతున్నది. కేంద్రాల్లో అధికారులు తేమ శాతం ఎకువగా ఉందని ధాన్యాన్ని కొనడానికి తిరసరిస్తున్నారు. దీంతో రైతులకు నష్టాలే మిగులుతున్నాయి.
యాసంగి ధాన్యం సేకరణకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. కలెక్టరేట్లో 24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్ (నెంబర్ 7995050809 ) ఏర్పాటు చేశాం. ప్రతిరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, కేంద్రాల నుంచి మిల్లుల వరకు రవాణా, రైస్ మిల్లుల్లో ఎప్పటికప్పుడు ధాన్యాన్ని అన్లోడ్ఖ చేసుకోవడం, రైతులకు మూడు రోజుల్లో పేమెంట్ జరిగేలా కంట్రోల్ రూమ్ నుంచి సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 54 రైస్‌మిల్లుల్లో 950 మంది హమాలీలు ప్రతిరోజు ధాన్యాన్ని అన్లోడ్ చేస్తున్నారు. మరో 950 హమాలీలను నియమించుకోవాలని మిల్లర్లకు సూచించాం. వడ్ల సేకరణ సాఫీగా సాగేందుకు జిల్లా అధికార యంత్రాంగానికి రైతులు, మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సహకరించాలి.
– హైమావతి, సిద్దిపేట జిల్లా కలెక్టర్
రాయపోల్, మే 14: తూకం వేసి ఆరు రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని ఇంత వరకు మిల్లులకు తరలించడం లేదు. నిత్యం ఎర్రటి ఎండలో వడ్ల దగ్గరనే ఉండాల్సి వస్తున్నది.లింగారెడ్డిపల్లి గ్రామ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు కేవలం ఒక్క లారీ మాత్రమే వచ్చింది.మిగత ఐదు లారీల వరకు ధాన్యం ఉండడంతో లారీల రాకపోవడంతో పాటు మిల్లర్లు అన్‌లోడు చేసుకోవడంలో నిర్లక్ష్యం చేయడంతో మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నేను 200 బస్తాల వడ్లు తెచ్చి, వాటిని జల్లి పట్టి తూకం వేసి ఆరురోజులు గడుస్తున్నది. రోజు రోజుకు ధాన్యం ఎక్కువగా వస్తున్నది. సెంటర్లో స్థ్ధలం కొరత, మరో పక్క తూకం వేసిన ధాన్యం అక్కడనే ఉండడంతో బస్దాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తున్నది. వాన పడితే ఏంది పరిస్థితి అని భయంగా ఉంది.
– కౌడగారి శ్రీనివాస్, రైతు, లింగారెడ్డిపల్లి, రాయపోల్ మండలం (సిద్దిపేట జిల్లా)
ట్రాక్టర్లు అన్లోడింగ్ అవుతలేదని ట్రాక్టర్లు వస్తలేవు. మల్ల మిల్లర్లు దోచుకుంటున్నరని చెబుతున్నరు. అందుకనే మా వడ్లు పోతలేవు. మాయి ఇరవై రోజుల నుంచి ఈడనే ఉన్నయి. వడ్లు కూడా పట్టినం. రైతులను దోచుకోవడానికే మిల్లర్లు దిగుమతి అపుతున్నరు. ఏ-గ్రేడ్ పేరుమీద కొంటలేరు. ఏవడ్లు అయినా బి-గ్రేడ్ పేరుతోనే కొంటున్నరు. మంత్రి ఊరికి ఐదుగురు సభ్యులతోని వడ్లు కొనిపిచ్చేలా కమిటీలు వేసినం అంటున్నరు. ఏక్కడ కూడా కమిటీ వాళ్లు మా రైతుల వద్దకు రాలేదు. ఎన్నడూ లేనివిధంగా మస్తు బాధలు పడుతున్నం.
– మహేశ్, రైతు, పందిల్ల (సిద్దిపేట జిల్లా)
కొండపాక, మే 14: మిల్లర్లతో అధికారులు కుమ్మకై రైతులను దోచుకుంటున్నారు. కొనుగోలు కేంద్రం వద్ద విద్యుత్ దీపాలు సక్రమంగా లేక, జాలి పట్టడానికి మిషనరీ సరిగా పనిచేయడం లేదు. జాలి పట్టడానికి రైతులు రాత్రింబవళ్లు కొనుగోలు కేంద్రాల వద్ద నిద్ర లేకుండా పడిగాపులు కాయాల్సి వస్తున్నది. అధికారులు, మిల్లర్లు, కుమ్మకై ధాన్యాన్ని రెండవ రకం కింద కొనుగోలు చేసి ఒక్కో రైతుకు వేల రూపాయల నష్టాన్ని కలిగిస్తున్నారు. నేడు కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసి 25 రోజులు దాటినా పట్టించుకునే వారు కరువయ్యారు. ఎవరికి చెప్పినా ఏమి లాభం లేకపోవడంతో ఎండలలో కష్టపడుతూ ధాన్యం ఆరబోసుకుంటున్నా. ధాన్యం సకాలంలో కాంటా చేయడం లేదు. వర్షాలు పడితే మా గతి ఏమి కావాలి.
– కోడెల పోచయ్య,రైతు, దుద్దెడ (సిద్దిపేట జిల్లా)
బెజ్జంకి, మే 14: నేను బెజ్జంకి కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసి 20 రోజులు అవుతున్నది. మ్యాశ్చర్ చచ్చింది. లారీలు లేక కాంటా పెడుతలేరు. కేంద్రానికి సరిపడా లారీలు కేటాయిస్తే అన్ని వడ్లుపోతాయి. రైతులందరం చాలా ఇబ్బంది పడుతున్నాం. అధికారులు స్పందించి లారీలు పంపించాలి.
– నల్లూరి దేవయ్య, రైతు, బెజ్జంకి, (సిద్దిపేట జిల్లా)