మెదక్, మే 17(నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం ఇటీవల 14 పంటలకు ప్రకటించిన మద్దతు ధరపై రైతులు పెదవి విరుస్తున్నారు. పంటల సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయని, ఈ మద్దతు ధరలు ఏమాత్రం సరిపోవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రో,డీజిల్ ధరలు పెరిగిపోవడంతో ఎరువులు, విత్తనాలు, ధరలపై ఎఫెక్టు పడింది. డీజిల్ ధర పెరగడంతో ట్రాక్టర్ దుక్కి దున్నే ఖర్చులు పెంచారు. 2026-2027 వానకాలం సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం (ఎంఎస్పీ) కనీస మద్దతు ధర ప్రకటించింది. వరి ఏ- గ్రేడ్ కు రూ. 2461 క్వింటాలుకు ప్రకటించింది. గతేడాది కంటే రూ. 72 పెంచింది. వరి సాధారణ రకానికి రూ. 2441 పెంచింది. మొక్కజొన్నకు రూ. 2410 మద్దతు ధర ప్రకటించింది.
గతేడాది కంటే రూ. 10 పెంచింది. రాగులుకు రూ. 5205 మద్దతు ధర ప్రకటించింది. గతేడాది కంటే రూ. 319 పెంచింది. జొన్నకు 4073 మద్దతు ధర ప్రకటించింది. గతేడాది కంటే రూ. 324 పెంచింది. సజ్జలకు రూ.2900 క్వింటాలుకు ధర ప్రకటించింది. గతేడాది కంటే రూ.125 పెంచింది. పెసలకు రూ. 8780 మద్దతు ధర ప్రకటించింది. గత ఏడాది కంటే రూ. 12 పెంచింది. కందులకు రూ. 8450 మద్దతు ధర ప్రకటించింది. గతేడాది కంటే రూ. 450 పెంచింది. మినుములు రూ. 8200 మద్దతు ధర ప్రకటించింది. ఈ ఏడాది రూ. 400 పెంచింది. వరి క్వింటాలుకు కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.72 పెంచడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగు ఖర్చులకు, ఆదాయానికి భారీగా వ్యత్యాసం ఉందని రైతులు తెలిపారు.
మెదక్ జిల్లాలో అత్యధికంగా రైతులు వరి సాగుచేస్తారు. రానున్న వానకాలంలో 3,16,690 ఎకరాల్లో వరి సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. 2025 వానకాలంలో 3,15,675 ఎకరాల్లో వరి పంట సాగు చేశారని, గతేడాది కంటే ఈ ఏడాది వరి సాగు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గతేడాది పత్తి 35,583 ఎకరాల్లో సాగు చేయగా, ఈ సీజన్లో 36,000 ఎకరాలు, మొక్కజొన్న 2626 ఎకరాల్లో సాగు చేయగా, ఈ ఏడాది 3వేల ఎకరాల్లో సాగుచేస్తారని అంచనా వేశారు. కంది గతేడాది 1835 ఎకరాలు, ఈ ఏడాది 1850 ఎకరాల్లో సాగుచేసే అవకాశం ఉంది.

03
గతేడాది పెసలు 945 ఎకరాలు, ఈ ఏడాది 1250 ఎకరాలు, మినుములు 670 ఎకరాలు సాగు చేయగా, ఈ ఏడాది 700 ఎకరాలు సాగు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. జొన్న 38 ఎకరాలు సాగు చేయగా, ఈ ఏడాది 40 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. సోయాబీన్ గతేడాది 112 ఎకరాలు, ఈ ఏడాది 125 ఎకరాలు, చెరువు గతేడాది 70 ఎకరాలు, ఈ సీజన్లో 75 ఎకరాలు , కూరగాయలు 699 ఎకరాలు సాగు చేయగా, ఈ ఏడాది 708 ఎకరాలు, ఆయిల్ పామ్ 1202 ఎకరాలు సాగు చేయగా, ఈ ఏడాది 7650 ఎకరాల్లో సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపింది. గతేడాది మెదక్ జిల్లాలో 3,65,018 ఎకరాల్లో రైతులు అన్నిరకాల పంటలు సాగు చేశారు. ఈ వానకాలం సీజన్లో 3,67,668 ఎకరాల్లో పంటలు సాగుచేస్తారని అంచనా వేశారు.
మెదక్ జిల్లాలో వానకాలం సీజన్‌కు 79,172 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం ఉంటాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. పత్తి విత్తనాలు 72,000 ప్యాకెట్లు , కందులు 73 క్వింటాళ్లు, మొక్కజొన్న 215 క్వింటాళ్లు, మినుములు 28 క్వింటాళ్లు, పెసర 62 క్వింటాళ్లు అవసరం పడుతాయని అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు.
మెదక్ జిల్లాలో వానకాలం సీజన్‌కు 59,870 మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరం పడతాయని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. యూరియా 26,500 మెట్రిక్ టన్నులు, డీఏపీ 2420 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 2317 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 27480 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 1153 మెట్రిక్ టన్నులు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు.
మెదక్ జిల్లాలో వానకాలం పంటలు సాగు చేసేందుకు ప్రణాళిక ఖరారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిం చాం. ఎరువులు, విత్తనాల కొరత రాకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. సీజన్‌కు ముందుగానే విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటాం. జూన్ రెండో వారంలో పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తాం. అధిక వానలు కురిసిన తర్వాతనే రైతులు పంటలు సాగుచేయాలి. పంట మార్పిడి పాటించి అధిక ఆదా యం పొందాలి. సాగులో వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తప్పక పాటించాలి.
– దేవకుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, మెదక్ జిల్లా