పుల్కల్, జూలై 27: పంటపొలాలకోసం ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటర్లకు అధికారులు కరెంట్ సరఫరా నిలిపివేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి ధర్నా చేశారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో సోమవారం విద్యుత్ అధికారులు మంజీరానది పరీవాహక ప్రాంతం రైతుల మోటర్లకు కరెంట్ సరఫరా నిలిపివేశారు. మండలంలోని పోచారం, పుల్కల్, మిన్పూర్, ఇసోజిపేట, గొంగ్లూర్, కోడూర్ గ్రామాలు సింగూరు ప్రాజెక్టు దిగువభాగంలో మంజీరానది తీరానికి దగ్గరలో ఉంటాయి. ఆయా గ్రామాల రైతులు సుమారు 40 ఏండ్ల నుంచి ఆనదిపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్నారు.
విద్యుత్ అధికారులు రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మోటర్లకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహించిన రైతులు అధికారులపై మండిపడ్డారు. విద్యుత్ సరఫరా చేయాలని పట్టుబట్టారు. దీంతో చేసేదిలేక మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద సంగారెడ్డి నుంచి సింగూర్ వెళ్లే ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. టైర్లు కాల్చి విద్యుత్ మోటర్ స్టార్టర్ డబ్బాలతో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. అధికారులు వచ్చే వరకు కదిలేది లేదంటూ రైతులు పట్టుబట్టారు. సుమారు రెండు గంటల పాటు రోడ్డుపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోయా యి.
అంతకుముందు పోచారంలో విద్యుత్ అధికారులను గ్రామ పంచాయతీ కార్యాలయంలో బంధించేందుకు ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ కృష్ణ, వ్యవసాయాధికారి చైతన్య, జోగిపేట సీఐ ధర్నా వద్దకు వచ్చి రైతులతో మాట్లాడారు. సమస్యను పై అధికారులకు తెలియజేసి న్యాయం జరిగేలా చూస్తామని తహసీల్దార్ వారికి నచ్చజెప్పారు. అధికారుల హామీ మేరకు రైతులు ధర్నా విరమించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు, రైతుసంఘాల నాయకులు పాల్గొన్నారు.