సిద్దిపేట, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రుణమాఫీ కాలేదని ఇటీవల దుబ్బాక నియోజకవర్గం చిట్టాపూర్‌కు చెందిన రైతు సోలిపేట సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం రైతులతో పాటు అందరినీ తీవ్రంగా కలిచివేసింది. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా రుణమాఫీ కానీ రైతులు వేల సంఖ్యలో ఉన్నారు. రుణమాఫీ కాక రైతులు ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తున్నది.
రూ.2 లక్షల రుణమాఫీ చేసామని గొప్పలు చెప్పకుంటున్నది. కానీ, క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరేలా ఉన్నాయి. సగం మందికి రుణమాఫీ కాక అన్నదాతలు గోసపడుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు ఏమో మాకేం తెల్వదు.. మాకు ఇంకా గైడ్‌లైన్స్ రాలేదంటున్నారు. రెండు లక్షల పైన ఉన్నవి కడితే మాఫీ చేస్తమంటిరి కదా .! మరి బ్యాంకుకు వెళ్లి కట్టిరావన్న సార్ .. కట్టిరా.. మరి రుణమాఫీ రాకపోతే మీరు ఇస్తారా..? అని రైతులు అంటే సమాధానం చెప్పడం లేదు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి రైతులది.
డబ్బులు కట్టాలా..? వద్దా…? కడితే బయట అప్పు తీసుకురావాలి..ఎప్పుడు రుణమాఫీ చేస్తారో తెలియదు. రైతుకు ముందుకు పోదామంటే నుయ్యి..వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. కొన్ని గ్రామాల్లో బ్యాంకుకు వెళ్లి సార్ నావి రెండు లక్షల పైన ఎంత ఉన్నవి కట్టుకో అని బయట వడ్డీలకు తెచ్చి మరి బ్యాంకులో రైతులు కట్టి వస్తున్నారు. 15 రోజులుగా రైతులు బ్యాంకులు, వ్యవసాయ శాఖ అధికారులు చుట్టూ తిరుగతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా మూడు విడతల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వందశాతం పంట రుణమాఫీ చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నది. కానీ, పూర్తిస్థాయిలో రైతులకు రుణమాఫీ కాక బ్యాంకులు, వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సాగు పనుల్లో నిమగ్నం కావాల్సిన రైతులంతా ప్రస్తుతం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాకుండా 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 తేదీ వరకు బ్యాంకుల్లో రుణం తీసుకున్న రైతులకు మాత్రమే రుణమాఫీ కటాఫ్ పెట్టింది.
అసలు వడ్డీ కలిపి రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు తొలి విడతలో జూలై 18న లక్ష రూపాయల వరకు, జూలై 30న లక్షన్నర లోపు, ఆగస్టు 15న రెండు లక్షల రుణాలను మాఫీ చేసినట్లు ప్రకటించింది. కానీ, రుణమాఫీలో ప్రభుత్వ నిబంధనలు, టెక్నికల్ సమస్యలతో పాటు రేషన్ కార్డు, రుణఖాతా మూసివేయడం తదితర సమస్యలతో చాలామంది రైతులకు రుణమాఫీ వర్తించలేదు. రూ. 2లక్షల పైన ఉన్న రైతుల రుణమాఫీ విషయంలో ఇంత వరకు ఒక స్పష్టత ఇవ్వక పోవడం తో రైతులు తమకు రుణమాఫీ అవుతుందా..? లేదా..? అని తమలో తాము కుమిలి పోతున్నారు.
అదే రందితో ఇటీవల దుబ్బాక నియోజకవర్గంలోని చిట్టాపూర్‌కు చెందిన రైతు సురేందర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయం పండుగలా సాగింది. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. రైతుభరోసా ఇవ్వడం లేదు. వందశాతం రుణమాఫీ చేయక తమను అరిగోస పెడుతున్నదని కాంగ్రెస్ సర్కారుపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రుణమాఫీ చేయాలని రైతులు ఆందోళనలు, నిరసనలకు దిగుతున్నారు. కొన్ని చోట్ల బ్యాంకులకు తాళాలు వేస్తున్నారు. రుణమా ఫీ కానీ రైతుల విషయంలో సర్వే చేస్తామని చెప్పి కొన్ని మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. రుణమాఫీ కానీ అందరి రైతుల సర్వే చేయాలి. కానీ, అలా చేయడం లేదు. కేవలం రేషన్ కార్డు లేని వారి వివరాలు మాత్రమే సేకరిస్తున్నారు. రేషన్ కార్డు లేని వారి జాబితాను రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులకు పంపింది.
దాని ప్రకారమే తాము సర్వే చేస్తున్నామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒక కుటుంబంలో రెండు లక్షల రుణమాఫీ కానీ వారి వివరాలను సేకరించడం లేదు. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. తమ కుటుంబంలో ఎంత మందికి ఎంత రుణాలు ఉన్నయి..? ఎంత మందికి రుణాలు మాఫీ చేయవచ్చు అనే వివరాలను సేకరించాల్సింది పోయి అదేం పట్టించుకోవడం లేదు. ఇంతకి రెండు లక్షల పైన రుణాలు ఉన్న కుటుంబాలకు రుణమాఫీ ఈ ప్రభుత్వం చేస్తుందా..? లేదా..? అనే సందేహాలు రైతులను వేధిస్తున్నాయి.
రైతులు ఎక్కని మెట్లు లేవు..కలవని అధికారి లేరు. జిల్లాకు చెందిన మంత్రులు కనీసం సమీక్ష నిర్వహించడం లేదు. జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటివరకు రుఫమాఫీపై సమీక్షా సమావే శం నిర్వహించ లేదు. మంత్రుల తీరుపై రైతులు మండి పడుతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులకు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచెయ్యి చూపింది.రైతుల సంఖ్యకు రుణమాఫీ లెక్కలకు పొంతన లేకుండా పోయింది.లక్ష రూపాయల వరకు ఒకసారి, లక్షన్నర వరకు రెండోసారి, రెండు లక్షల వరకు మూడోసారి రుణమాఫీ చేసినట్లు ఆర్భాటంగా ప్రకటించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసింది. అప్పటి ఇప్పటి లెక్కలకు చూసుకుంటే రుణమాఫీ రైతుల సంఖ్యను కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా తగ్గిచింది.
రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తే రైతుల సంఖ్య పెరగాలి గాని తగ్గింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసినప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 4,17,591 మందికి రుణమాఫీ జరిగింది. 2014లో ఉమ్మడి జిల్లాలో 1,50,000 మంది రైతులకు రూ.398 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసింది. 2018లో సిద్దిపేట జిల్లాలో 81,565 మందికి రూ. 418 కోట్లు, మెదక్ జిల్లాలో 73,026 మందికి రూ. 366.39 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 1,13,000 మందికి రూ. 678 కోట్లు మాఫీ చేసింది. ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్ష రూపాయల లోపు రుణమాఫీ జరిగింది.
మొత్తంగా 4,17,591 మందికి రూ. 1,860.39 కోట్లు రుణమాఫీ చేసి బీఆర్ఎస్ రైతు ప్రభుత్వం అని నిరూపించుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేశామని చెప్పుకుంటున్నది. వీరు చేసింది ఎంతంటే 2,85,493 మంది రైతులకు రుణమాఫీ చేశారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చూసుకుంటేనే 1,32,098 మంది రైతులకు కోత పెట్టింది.రెండు లక్షల వరకు రుణమాఫీ అన్నప్పుడు రైతుల సంఖ్య పెరగాల్సి ఉండగా పూర్తిగా కోతలు పెట్టింది. దీంతో గ్రామాల్లో 50 శాతం మందికి రుణమాఫీ కాలేదు.