మద్దూరు(ధూళిమిట్ట), జూన్ 3: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని బైరాన్‌పల్లిలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై రైతులు భగ్గుమన్నారు. బుధవారం ధాన్యం కొనుగోలు చేయాలని గ్రామ సర్పంచ్ బర్మ రాజమల్లయ్య ఆధ్వర్యంలో సుమారు 200 మంది రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకువచ్చి నెల రోజులు గడుస్తున్నా కాంటా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు అందుబాటులో లేవని ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకోవాలని తహసీల్దార్ చెప్పారన్నారు. ట్రాక్టర్ల ద్వారా మిల్లులకు ధాన్యం తీసుకుపోతే మిల్లర్లు ధాన్యాన్ని దించుకోవడం లేదన్నారు.

ఒకవేళ మిల్లర్లు ధాన్యాన్ని దించుకుంటే క్వింటాల్‌కు 5 నుంచి 8కిలోల వరకు కోత విధిస్తున్నారని వాపోయారు. ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఇంత ఇబ్బంది ఎప్పుడూ పడలేదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు సుమారు మూడు గంటల పాటు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టగా మద్దూరు ఎస్సై మహ్మద్ ఆసిఫ్ అక్కడికి చేరుకొని ఆందోళన విరమింపజేసేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వం చేత వడ్లు కొనిపించాలని గ్రామానికి చెందిన గొర్ల మల్లయ్య అనే రైతు అక్కడే ఉన్న ఎస్సై ఆసిఫ్ కాళ్లు మొక్కి ప్రాధేయపడ్డాడు. ఎస్సై రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.
మద్దూరు మండలంలోని వల్లంపట్లలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఆలేటి యాదగిరి ఆధ్వర్యంలో రైతులు ధాన్యం బస్తాలను రోడ్డుపై ఉంచి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంఘటనా స్థలానికి మద్దూరు ఎస్సై మహ్మద్ ఆసిఫ్ చేరుకొని రైతులకు నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు.