సిద్దిపేట, మార్చి 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘సీఎం రేవంత్‌రెడ్డి సార్ మేము రైతు లం కామా..? మాకెందుకు పంట రుణమాఫీ కాలేదు? మీరు ఇచ్చిన మాట ప్రకా రం రెండు లక్షల పంట రుణమాఫీ చేయాలి కదా.. ఎందుకు చేయడం లేదు’ అంటూ సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన రైతులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షల పంట రుణమాఫీ చేస్తానని చెప్పి గద్దెనెక్కిన తర్వాత రైతు సంక్షేమాన్ని విస్మరించిందని కర్షకులు మండిపడుతున్నారు. రైతులకు రెండు లక్షల వరకు పంటరుణ మాఫీ చేస్తామని చెప్పి పూర్తి స్థాయిలో చేయలేదు. పైగా పంట రుణమాఫీ పూర్తి చేశామని ప్రభుత్వం చెబుతున్నది. పంట రుణమాఫీ కానీ రైతులు ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్నారు. పంట రుణమాఫీ కాని రైతులు సిద్దిపేట జిల్లాలో 50 వేలకు పైగానే ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతలుగా పంట రుణమాఫీ చేసినట్లు గొప్పలు చెప్పింది. ఇక్కడ చేసింది గోరంత.. చెప్పేది కొండంత.. గ్రామాల్లో 50 శాతానికి పైగా రైతులకు పంట రుణమాఫీ కాలేదు. దీంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నాలుగు విడతలో రూ. 2 లక్షల వరకు పంట రుణమాఫీ చేశామని, పంట రుణమాఫీ పూర్తైందని ప్రకటన చేసింది. రెండు లక్షల పైన ఎంత ఉన్నా దానిని రైతు బ్యాంకుకు చెల్లిస్తే రెండు లక్షల పంట రుణమాఫీ చేస్తామని చెప్పింది.
వీరికి ఇంత వరకు పంటరుణమాఫీ కాలేదు. ఈ విషయంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేయాలనుకున్న రెండు లక్షల పంట రుణమాఫీ రైతుల లోన్ అకౌంట్లో జమ చేసి మిగతా డబ్బులు కట్టమంటే బాగుండు కానీ అలా ప్రభుత్వం చేయలేదు. మరికొంత మంది రైతులు రూ.రెండు లక్షల మీద కడితేనే పంట రుణమాఫీ అవుతుందేమోనని చెప్పి రైతులు అధిక వడ్డీలకు తెచ్చి మిగతా డబ్బులు బ్యాంకుల్లో కట్టారు. వీరి అప్పలు తడిసి మోపెడయ్యాయి. ఎంతో మంది రైతులు జిల్లాలో పంట రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు.
సిద్దిపేట జిల్లా నర్మెట గ్రామ శివారులోని ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఆ గ్రామంలోనే వందశాతం పంట రుణమాఫీ కాలేదు. అన్ని గ్రామాల్లో వంద శాతం పంట రుణమాఫీ చేశామని చెప్పుకొంటున్న కాంగ్రెస్ ప్రభు త్వం నర్మెటలో ఇంకా పంట రుణమాఫీకాని రైతులు ఉన్నారు. గ్రామ పరిధిలో పంట రుణమాఫీకి అర్హులైనవారు 750 మంది రైతులు ఉండగా 425 మందికి మాత్రమే పంట రుణమాఫీ చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
సిద్దిపేట నియోజకవర్గంలో సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, చిన్నకోడూరు, నారాయణరావుపేట, నంగునూరు మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం రెండు లక్షల పంట రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్య 43,363 మంది ఉన్నారు. వీరికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిగా రెండు లక్షల పంట రుణమాఫీ కాలేదు. ఇందులో 20,514 మందికి మాత్రమే మాఫీ అయ్యింది. మిగతా 22,849 మంది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపింది.
మండలాల వారీగా చూస్తే చిన్నకోడూరు మండలంలో 12,744 మంది అర్హులైన రైతులు ఉంటే 5,392 మందికి, నారాయణరావుపేట మండలంలో 5,238 మంది రైతులకు 2743 మందికి, సిద్దిపేట అర్బన్‌లో 4,998 మంది రైతులకు 2,366 మందికి, సిద్దిపేట రూరల్‌లో 8,153 మంది రైతులకు 4,352 మందికి, నంగునూరు మండలంలో 12,230 మంది రైతులకు 5,661 మందికి మాత్రమే పంట రుణమాఫీ పూర్తిగా అయ్యింది. రెండు లక్షలలోపు ఉన్న 10,217 మంది రైతుల పంట రుణమాఫీని వివిధ కారణాల వల్ల చేయలేదు. రెండు లక్షల పైన ఉన్న రైతులు 12,632 మంది ఉన్నారు. పంట రుణమాఫీ కాని వారు సిద్దిపేట నియోజకవర్గంలో 22,849 మంది రైతులు ఉన్నారు. అర్హత ఉన్నా తమకు మాఫీ కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.