చిలిపిచెడ్, జూన్ 24 : పశు వైద్యుడు లేక మూగ జీవాలకు వైద్యం అందడం లేదు. వైద్యం కోసం పశువులను దవాఖానకు తీసుకువస్తున్న రైతులు..ఇక్కడ సిబ్బంది కోసం పడిగాపులు కాయాల్సి వస్తున్నది. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల కేంద్రంతో పాటు ఫైజాబాద్ పరిసర గ్రామాల పశువులకు వైద్యం అందడడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన చిలిపిచెడ్‌లో పశువైద్యశాల లేకపోవడంతో మేజరు గ్రామ పంచాయతీ చిట్కుల్, ఫైజాబాద్‌లో ఉన్నప్పటికీ సకాలంలో వైద్యశాల తెరిచి వైద్యం అందించకపోవడంతో పాడిరైతులు నిరాశ చెందుతున్నారు.
ప్రభుత్వం లక్షల రూపాయలను వెచ్చించి మందులు సరఫరా చేస్తున్నా..ఇక్కడ పశువైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో సరైన సేవలు అందడం లేదు. పశువులను వైద్యం కోసం తీసుకువచ్చి..ఇక్కడ సరైన సేవలు అందించకపోవడంతో వెనుతిరిగి పోవాల్సి వస్తున్నదని మండల పశుపోషకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పర్యవేక్షించి పశువులకు సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.