గజ్వేల్, మే 17: రైతులకు నకిలీ విత్తన కష్టాలు తప్పడం లేదు. అమాయక రైతులకు కొందరు వ్యాపారులు కాలం చెల్లిన విత్తనాలను అంటగడుతూ సొమ్ముచేసుకుంటున్నారు. కాలం చెల్లిన విత్తనాలను మార్కెట్లో అమ్మకాలు చేపట్టవద్దని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నా, వారి మాటలను పెడచెవిన పెడుతూ కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.
గజ్వేల్ కేంద్రంగా కాలం చెల్లిన, నకిలీ విత్తనాల అమ్మకాలు జరుగుతున్నా వ్యవసాయ అధికారులు పట్టనటుగా వ్యవహరిస్తున్నరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గజ్వేల్ నియోజకవర్గ కేంద్రానికి విత్తనాలు కొనుగోలు చేసేందుకు గజ్వేల్, జగదేవ్‌పూర్, వర్గల్, మర్కూక్, రాయపోల్, దౌల్తాబాద్, ములుగు మండలాలకు చెందిన రైతులు వస్తుంటారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఆయా గ్రామాల్లో ఎక్కువగా వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయల పంటలు సాగు చేస్తారు.
గజ్వేల్, జగదేవ్‌పూర్ మండలాల్లో రైతులు చాలా ఏండ్లుగా వరి, పత్తి పంటలు ఎక్కువగా సాగుచేస్తున్నారు. వర్గల్, ములుగు, మర్కూక్ మండలాల్లో మాత్రం రైతులు ఎక్కువగా కూరగాయలు పండిస్తున్నారు. ఈ ప్రాంత రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వ్యాపారులు కాలం చెల్లిన విత్తనాలను అమ్మకాలు చేపడుతూ మోసం చేస్తున్నారు. దీంతో రైతులు పంటలు సాగు చేసి తీవ్రంగా నష్టపోతున్నారు. ఆశించిన దిగుబడి రాకపోవడంతో రైతులు దిగులు పడుతున్నారు. కొన్ని విత్తనాలు మాత్రం అసలు పూత, కాత లేకుండా ఏపుగా పెరగడంతో తీవ్రంగా నష్టపోయిన సంఘటనలు ఉన్నాయి.
రెండు వారాల క్రితం..
15రోజుల క్రితం గజ్వేల్ మండలం గిరిపల్లి గ్రామానికి చెందిన రైతు గజ్వేల్‌లోని ఓ ఫర్టిలైజన్ దుకాణంలో మొక్కజొన్న (బుట్ట మొక్కజొన్న) విత్తన ప్యాకెట్లను కొనుగోలు చేశాడు. విత్తనాలను విత్తే సమయంలో ప్యాకెట్‌ను తెరిచి చూడగా, అందులోని విత్తనాలు పురుగులు పట్టి పుచ్చుతో ఉన్నాయి. వెంటనే ఆ విత్తన ప్యాకెట్‌ను తీసుకొని దుకాణాదారుడి వద్దకు వెళ్లగా పొంతనలేని సమాధా నం చెప్పడంతో వెంటనే వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశాడు. గతేడాది జగదేవ్‌పూర్ మండలంలోని తీగుల్ గ్రామానికి చెందిన రైతు గజ్వేల్ పట్టణంలోని ఓ దుకాణంలో కర్బూజ విత్తనాలు కొనుగోలు చేసి సాగుచేశాడు.
పంట చేతికొస్తుందనే సమయానికి ఎలాంటి ఖాతా రాకుండా ఉండడంతో అధికారులకు ఫిర్యాదు చేశాడు. కర్బూజ పంటసాగు కోసం చేసిన అప్పులతో పాటు పెట్టుబడులు అతనికి భారంగా మారాయి. ఇలాంటి సంఘటనలు అనేకం చోటుచేసుకుంటు న్నా వ్యవసాయాధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం రికార్డులను తనిఖీ చేయడానికే పరిమితమవుతున్నారు తప్పా కాలం చెల్లిన విత్తనాలను గుర్తించడంలో విఫలమవుతున్నరనే విమర్శలు ఉన్నాయి.
గతేడాది మేలో ఏసీపీ పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో గజ్వేల్‌లోని లక్ష్మీబాలాజీ ట్రేడర్స్, పవనసుత ట్రేడర్స్, శ్రీ సాయి ఫర్టిలైజర్స్ దుకాణాల్లో కాలంచెల్లిన వరి, మెంతు లు, గంగవాయిలి కూర, బీర్నీస్తో పాటు కాలంచెల్లిన పురుగుల మందులు పట్టుకున్నారు. 610 కిలోల కాలం చెల్లిన విత్తనాలను పట్టుకొని వ్యవసాయాధికారులకు అప్పగించారు. ప్రజ్ఞాఫూర్లోని పద్మావతి రైతు సేవా కేంద్రంలో కాలం చెల్లిన విత్తనాలు పట్టుకున్నారు.
ఇలాంటి సంఘటనలు ఏటా చోటుచేసుకుంటున్నా వ్యవసాధియాకారులు మాత్రం ముందస్తుగా మేల్కొవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రైతులు ఫిర్యాదు చేసినా అధికారులు అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నరనే ఆరోపణలు ఉన్నాయి. నకిలీ, కాలంచెల్లిన విత్తనాలు విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. విత్తనాల మీద ఏమాత్రం అనుమానం వచ్చినా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. విత్తనాల కొనుగోళ్లకు సంబంధించి రసీదులు దగ్గర ఉంచుకోవాలి. నష్టపోయినప్పుడు రైతులు వినియోగదారుల ఫోరం, కోర్టుల్లో కేసులు వేసి నష్టపరిహారాన్ని పొందే అవకాశం ఉంటుంది.