అసలే మెట్ట ప్రాంతం… వర్షాధారం తప్ప ఏ ఇతర ప్రత్యామ్నాయ సాగునీటి వసతులు లేని కరువు పీడిత ప్రాంతం… ఒకప్పుడు తాగేందుకు నీళ్లు లేక అల్లాడిన ప్రాంతం… తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొని పశువులను కాపాడుకునేందుకు పశుగ్రాసం (వరిగడ్డి) కోసం పరితపించిన ప్రాంతం… గడిచిన పుష్కర కాలంగా ఒకవైపు వరుణ దేవుడి కరుణ, మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీటికి ఇబ్బందులు లేకుండా కరువు నుంచి కోలుకుంటున్న ప్రాంతం… ఇప్పుడు వానదేవుడు కరుణించక పాలకుల నిర్లక్ష్యంతో మళ్లీ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మెట్ట ప్రాంతం కరువు కోరల్లోకి వెళ్లింది.
హుస్నాబాద్, జూలై 17: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాలతో పాటు నియోజకవర్గంలోని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, సైదాపూర్, హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల రైతులు వానల కోసం పరితపిస్తున్నారు. ‘వానమ్మ… వానమ్మ… వానమ్మా… ఒక్కసారైనా వచ్చిపోవా… వానమ్మా…’ అంటూ వేడుకుంటున్నారు. 2025 జూన్, జూలైలో కురిసిన వర్షంతో పోల్చితే ఈ ఏడాది అతితక్కువ వర్షం ఇక్కడ కురిసింది. గతేడాది జూన్లో 94.2 మి.మీ, జూలైలో 339.2 మి.మీ వర్షం పడింది.

ఈ ఏడాది జూన్లో కేవలం 57.0మి.మీ, జూలైలో 69.0 మి.మీ వర్షం మాత్రమే పడింది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు పూర్తవుతున్నా వరదపారే వర్షం ఇప్పటి వరకు పడలేదు. దీంతో ప్రజలు గ్రామ దేవతలకు పూజలు, జలాభిషేకాలు, కప్పతల్లి ఆటలు ఆడటం చేస్తున్నారు. హుస్నాబాద్ డివిజన్లో గతేడాది జూలై నెలాఖరు వరకు సమృద్ధిగా వానలు పడటంతో 1,00,353 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగుచేశారు. ఈసారి వర్షాభావ పరిస్థితులతో ఇందులో 20శాతం పంటలు సాగు కాకపోవడం గమనార్హం.
ఏటా జూలై నెలాఖరు వరకు పచ్చని పంటపొలాలతో కళకళలాడే గ్రామీణ ప్రాంతాలు, వర్షాలు లేక పంటలు సాగుచేయక పోవడంతో మొత్తం బీళ్లుగా కనిపిస్తున్నాయి. ఖాళీ మడికట్లను చూసి రైతులు విలవిలలాడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటి వరకు ఆరుతడి పంటల కోసం కనీసం దుక్కులు కూడా దున్నని రైతులు ఉన్నారంటే హుస్నాబాద్ ప్రాంతంలో ఎంతటి కరువు పరిస్థితులు నెలకొన్నాయో విదితమవుతుంది.

తొలకరి జల్లులతో మురిసిన రైతులు బోరుబావుల్లో ఉన్న కొద్దిపాటి నీళ్లతో ఎన్నో ఆశలతో వరినార్లు పోశారు. అవి ఎదిగి ముదిరిపోతున్నాయి. ఈ సమయానికి పత్తి పంట ఏపుగా ఎదిగి పూత దశలో ఉండాల్సింది. కానీ, పెట్టిన విత్తనాలు మొలవక, మొలిచిన మొక్కలు ఎండకు మాడిపోతున్నాయి. పత్తి మొక్కలను కాపాడుకునేందుకు రైతులు బిందెలతో నీళ్లు పోస్తున్నారు.
1994 నుంచి 2004 వరకు పదేండ్ల పాటు హుస్నాబాద్ మెట్ట ప్రాంతం తీవ్ర కరువు కాటకాలను ఎదుర్కొంది. తాగునీళ్లకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. వరుస కరువులతో పంటలు పండలేదు. పశువులకు పశుగ్రాసం కరువైంది. ప్రభుత్వం ఇతర ప్రాంతాల నుంచి పశుగ్రాసం తెప్పించి రైతులకు సరఫరా చేసింది. అప్పట్లో పశుగ్రాసం కోసం హుస్నాబాద్ రైతులు కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితులు మళ్లీ దాపురిస్తాయా అని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గడిచిన పదేండ్లుగా రైతులకు కరువు అంటే తెలియలేదు.

ఇందుకు కారణం ఏటా వర్షాలు సమృద్ధిగా కురవడం, బీఆర్ఎస్ ప్రభుత్వం మిష న్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీసి భూగర్భ జలాలు పెరిగేందుకు కృషిచేసింది. కాళేశ్వరం, కాకతీయ కాలువ, దేవాదుల ద్వారా కొన్ని మెట్ట ప్రాంతాలకు నీళ్లందాయి. హుస్నాబాద్ ప్రాం తంలోని గౌరవెల్లి రిజర్వాయర్లో టీఎంసీ వరకు నీళ్లు నింపడం, మహాసముద్రంగండి, గాడుదులలొద్ది, శనిగరం చెరువు, ఎల్లమ్మ చెరువులాంటి చిన్ననీటి వనరులను అభివృద్ధి చేయడంతో బోరుబావుల్లో నీళ్లు పుష్కలంగా ఉండి రైతులు మూడు పంటలు పండించుకున్నారు. కానీ, ఈసారి ఆ పరిస్థితి లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
రెండు నెలల నుంచి వానల కోసం ఎదురు చూస్తున్నం. విత్తనాలు, ఎరువులు కొనుక్కొని సిద్ధంగా ఉంచుకున్నం. నార్లు పోసి పొలం దున్నేందుకు కూడా సిద్ధంగా ఉన్నం. వానలు పడతలేవు. వానలు పడాలని రోజూ దేవుళ్లకు మొక్కుతున్నం. దేవతలకు నీళ్లుపోస్తున్నం. మరో 15 రోజుల్లో వానలు పడకుంటే ఈ ఏడు కాలం పోయినట్లే… కరువు మొదలైనట్లే.
– ఎల్లయ్య, కౌలు రైతు, మాలపల్లి, హుస్నాబాద్ మండలం (సిద్దిపేట జిల్లా)
ఈ ఏడు వర్షాలు లేక ఇప్పటి వరకు వరినాట్లు వేయలేదు. విత్తనాలు పెట్టలేదు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయితే మాకు వానతో పనిలేకుండా పంటలు సాగు చేసుకునేటోళ్లం. కాంగ్రెస్ సర్కారు ఎందుకు పూర్తి చేస్తలేదో తెలుస్త లేదు. కనీసం ప్రాజెక్టులో నీళ్లు నింపినా మా బావుల్లో నీళ్లుండేవి. హుస్నాబాద్ ప్రాంతం రైతులకు కాల్వ నీళ్ల ద్వారా పంటలు సాగుచేసుకునే రోజులు ఎప్పుడు వస్తాయో చూడాలి.
– మోహన్రావు, రైతు, చౌటపల్లి-అక్కన్నపేట మండలం (సిద్దిపేట జిల్లా)