సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలానికి చెందిన ఓ రైతు 4నెలల కిందట రెండెకరాల భూమిని కొనుగోలు చేశాడు. దానిని స్థానిక తహసీల్ కార్యాలయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్లాట్‌బుక్ చేసుకొని భూభారతి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. పది రోజుల్లో ఆ రైతుకు పట్టాదారు పాస్ పుస్తకం ఇంటికి పంపిస్తామని చెప్పారు. నాలుగు నెలలైనా ఆ రైతుకు ఇంతవరకు పట్టాదారు పాస్ పుస్తకం రాలేదు.
మెదక్ జిల్లాకు చెందిన మరో రైతు 8 నెలల కిందట నాలుగెకరాలు భూమిని కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ పూర్తయి ఎనిమిది నెలలు అవుతున్నా ఇంత వరకు పట్టాదారు పాసు పుస్తకం రాలేదు. ఇది ఈ ఇద్దరి రైతుల సమస్యనే కాదు నూతనంగా భూములు కొనుగోలు చేసిన ఏ రైతుకు కూడా పట్టాదారు పాసు పుస్తకం రావడం లేదు. వాటి కోసం నిత్యం కార్యాలయాల చుట్టూ రైతులు తిరుగుతున్నారు. కానీ, అధికారులు మాత్రం సరైన సమాధానం చెప్పడం లేదు. త్వరలోనే వస్తాయంటూ దాటవేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
సిద్దిపేట, జనవరి 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ హయాంలో తహసీల్ కార్యాలయంలోని భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియగానే, వెంటేనే ఆ రైతు భూవివరాలు వచ్చేవి. రైతుకు ఇదివరకే పట్టాపాస్ పుస్తకం ఉంటే, అందులో తాజాగా జరిగిన భూ క్రయవిక్రయాల వివరాలు నమోదు చేసి, ప్రింట్ తీసి ఇచ్చేవారు.పట్టాదారు పాస్ పుస్తకం లేకపోతే కొత్తది రైతుకు 15 రోజుల్లోగా పోస్టాఫీసు ద్వారా రైతు ఇంటికి నేరుగా పట్టాపాస్‌బుక్ వచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధరణి స్థానంలో భూభారతి పోర్టల్‌ను తెచ్చింది. ధరణి కన్నా గొప్పగా తీసుకువచ్చామని సీఎం నుంచి మంత్రుల వరకు ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తున్నారు.
కానీ, సేవలు అంతంతమాత్రమే అని చెప్పవచ్చు. భూభారతి వెబ్సైట్ ద్వారా వ్యవసాయ భూముల విధానంలో మార్పులు తీసుకువచ్చి అందినకాడిక అక్రమార్కులు దోచేసుకుంటున్నారు. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా చూడాలని,వాటిని రిజిస్ట్రేషన్ చేయరాదని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఉన్నా, వాటిని పట్టించుకోకుండా కొంతమంది అధికారులు అమ్యామ్యాలకు అలవాటుపడి రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భూభారతి వెబ్సైట్ ద్వారా ప్రతిరోజు తహసీల్ కార్యాలయాల్లో పదుల సంఖ్యలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతి వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కానీ, కొత్తగా భూములు కొన్న రైతులకు మాత్రం పట్టాదారు పాస్ పుస్తకాలు రావడం లేదు. ఏడెనిమిది నెలలుగా పట్టాదారు పాస్ పుస్తకాలు సకాలంలో రాక రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీ సేవకు, తహసీల్ కార్యాలయాలు, పోస్టాఫీసులకు వెళ్లి తమ పట్టాదారు పాస్ పుస్తకం ఎందుకు రాలేదని రైతులు అధికారులను అడుగుతున్నారు. అధికారులను అడిగితే వారి వద్ద నుంచి సరైన సమాధానం రావడం లేదు.
రైతులు ఏ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్న పట్టాదారు పాసు పుస్తకం ప్రామాణికం. బ్యాంకులో పంట రుణం తీసుకోవాలంటే పట్టాదారు పాసు పుస్తకం తప్పనిసరి. ఇది లేనిది బ్యాంకులు వ్యవసాయ రుణాలు ఇవ్వడం లేదు. యూరియా కోసం క్యూ కడితే, దానికి పాసు బుక్కు అడుగుతున్నారు. పంట రుణమాఫీ, రైతు భరోసాతో పాటు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, రైతుబీమా, ఎరువులు, విత్తనాలకు, ఇటీవల సబ్సిడీపై యంత్రాలు కావాలన్నా పట్టాదారు పాసు పుస్తకం తప్పనిసరి అంటున్నారు అధికారులు. డ్రిప్, పాలీహౌస్‌లు పాస్ పుస్తకం కావాల్సిందే. చాలాకాలంగా పట్టాదారు పాస్ పుస్తకం రాకపోవడంతో రైతులు ప్రభుత్వ పథకాలను కోల్పోతున్నారు.
వ్యవసాయ భూముల క్రయ విక్రయాల్లో భాగంగా ముందుగా మీసేవకు రైతు వెళ్లి, అక్కడ తన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి స్లాట్‌బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వానికి అక్కడ ఉన్న భూవిలువ ప్రకారం రుసుము చెల్లించాలి. ఆ స్లాట్‌లో వచ్చిన తేదీ రోజు స్థానిక తహసీల్ కార్యాలయంలో భూభారతి వెబ్సైట్ ఆధారంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఆతర్వాత పోస్టాఫీసు ద్వారా భూమి కొనుగోలు చేసిన రైతుకు నేరుగా ఇంటికే పట్టాదారు పాసు పుస్తకాన్ని 15 రోజుల్లోగా పంపాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలా జరిగింది. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత నెలలు గడుస్తున్నా రైతులకు పట్టాదారు పాస్ బుక్కులు అందడం లేదు.
ధరణి పోర్టల్ కన్నా దీటుగా భూభారతిని తీసుకువస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం అభాసుపాలైంది. ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భూభారతిలో అవకతవకలు జరిగినట్లు వెలుగుచూసింది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా భూరిజిస్ట్రేషన్ జరిగిన విధానంపై అంతర్గతంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ డబ్బుల దారి మళ్లినట్లు గుర్తించిన అధికారులు, ఆ దిశగా ఎక్కడ ఏమైనా లోపాలు జరిగాయా..? అనే అంశాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది.
రిజిస్ట్రేషన్ సమయంలో ప్రభుత్వం నిర్దేశించిన మేర స్టాంప్ డ్యూటీ (డబ్బులు) చెల్లించకుండా అక్రమాలకు పాల్పడినట్లు జనగామ, యాదాద్రి తదితర జిల్లాలో పెద్ద ఎత్తున స్కాం బయట పడిన విషయం తెలిసిందే. వీటితో పాటు సంగారెడ్డి జిల్లాలోని హైదరాబాద్ సమీపంలోని అమీన్పూర్, కంది, సదాశివపేటలతో పాటు. మెదక్ జిల్లాలోని కొన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలతో పాటు భూభారతి వచ్చాక సిద్దిపేట జిల్లాలోని రాజీవ్ రహదారి ఆనుకొని ఉన్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లపై, వీటితో పాటు ప్రధాన పట్టణాలకు ఆనుకొని ఉన్న మండలాల తహసీల్దార్ల (రిజిస్ట్రేషన్) కార్యాలయాల్లో అంతర్గతంగా విచారణ జరుగుతున్నట్లు సమాచారం.