గజ్వేల్, మార్చి 4: రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి విమర్శించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వ్యవసాయం సంక్షోభంగా మారి అప్పుల బాధలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
గజ్వేల్ మండలం గిరిపల్లిలో అప్పుల బాధతో తండ్రీకొడుకులు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కుటుంబ రోడ్డున పడిందని, కనీసం అధికారులు బాధిత కుటుంబం వివరాలు సేకరించలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు లేక ఆత్మహత్యకు పాల్పడుతున్న రైతులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో కేసీఆర్ జిల్లాలో రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులను నిర్మించారని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ హయాంలో మండుటెండల్లో సాగునీరు అందించి రైతుల పంటలు కాపాడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు ఇవ్వకుండా రైతుల ఉసురుపోసుకుంటున్నట్లు ఆరోపించారు. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్దిని అడ్డుకుంటూ కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని పేర్కొన్నారు. ఇంటింటికీ తాగునీటికి అందించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, కాంగ్రెస్ నేతలు పదవుల కోసం కుమ్ములాడుకుంటూ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ యాదవరెడ్డి డిమాండ్ చేశారు.