వానకాలం సాగుకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సీజన్‌కు సంబంధించిన ప్రణాళికను మెదక్ జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఖరారు చేశారు. ఈ సారి మొత్తం 3.76 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉందని ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. గత సీజన్‌తో పోలిస్తే ఈ సారి 26వేల ఎకరాల్లో పంటల సాగు విస్తీర్ణం పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. అత్యధికంగా 3.10 లక్షల ఎకరాల్లో వరి, 45వేల ఎకరాల్లో పత్తి, 7200 ఎకరాల్లో మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు వేసుకోవచ్చని భావిస్తున్నారు. ఇందుకోసం 78వేల క్వింటాళ్ల విత్తనాలు, 96.34 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయని నివేదికలో పేర్కొన్నారు. సీజన్ ప్రారంభానికి ముందే డిమాండ్‌కు అనుగుణంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా సరఫరా పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
– మెదక్ (నమస్తే తెలంగాణ), మే 30
మెదక్, మే 21 (నమస్తే తెలంగాణ): వానకాలం సీజన్‌కు సంబంధించి పంటల సాగు ప్రణాళిక ఖరారైంది. ఈ సీజన్ పంటల సాగు ప్రణాళికను ఇప్పటికే జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. వానకాలం 2023లో అధికారుల అంచనా ప్రకారం జిల్లా వ్యాప్తంగా 3.76 లక్షల ఎకరాల్లో ఆయా రకాల పంటలు సాగయ్యే అవకాశమున్నదని ప్రణాళికలు రూపొందించారు. ఇందులో ప్రధానంగా వరి 3.10 లక్షల ఎకరాల్లో సాగువుతుందని అంచనా వేయగా, పత్తి 45వేల ఎకరాల్లో, మొక్కజొన్న 7200 ఎకరాలతో పాటు ఇతర పంటలు వేయనున్నారు. అదేవిధంగా పంటల సాగు విస్తీర్ణానికి తగ్గట్టుగా ఎరువులు, విత్తనాల అవసరాన్ని రూపొందించారు. ఈ వానకాలంలో 78 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం కానున్నాయని 96.34 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల కోసం ప్రతిపాదనలు రూపొందించారు.
3.76 లక్షల ఎకరాల్లో పంటల సాగు..
జిల్లాలోని మెదక్, తూప్రాన్, నర్సాపూర్ డివిజన్ పరిధిలో వానకాలం పంటల సాగుకు సంబంధించిన ప్రణాళికలను వ్యవసాయశాఖ రూపొందించింది. గత వానకాలంతో పోలిస్తే ఈ సీజన్లో సాగు విస్తీర్ణం పెరిగింది. గత సీజన్లో 3.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, ప్రస్తుతం 3.76 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారుల అంచనా. ఇందులో 3.10 లక్షల ఎకరాల్లో వరి, 45 వేల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న 7వేల ఎకరాల్లో, కంది 4 వేల ఎకరాల్లో, 11 వేల ఎకరాల్లో మినుములు, పెసర్లు 1500, సోయాబీన్ 120 ఎకరాల్లో, జొన్న 200 ఎకరాల్లో, ఇతర పంటలు 5500 ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. ఈ ప్రణాళికను ఇప్పటికే జిల్లా అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు.
78వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం
జిల్లాలో వానకాలంలో సాగయ్యే పంటలకు అనుగుణంగా విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయశాఖధికారులు అంచనా వేసి ప్రణాళికలు రూపొందించారు. 77,700 క్వింటాళ్లలో వరి విత్తనాలు అవసరం కానున్నాయని, 720 క్వింటాళ్లలో మొకజొన్న, 228 క్వింటాళ్లలో పత్తి, 123 క్వింటాళ్లలో కంది, 43 క్వింటాళ్లలో పెసర, 135 క్వింటాళ్లలో మినుము విత్తనాలతో పాటు ఆయా రకాల పంటల విత్తనాలు అవసరం కానున్నాయి. డిమాండ్ మేరకు విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు జిల్లా వ్యవసాయశాఖ చర్యలు తీసుకుంటుంది.
96.34 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు..
వచ్చే వానకాలం సీజన్‌కు సంబంధించి ఆయా రకాల పంటలను సాగు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా రైతులకు 96.34 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కానున్నాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. వీటిలో 41,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కానుండగా, 6,500 మెట్రిక్ టన్నుల డీఏపీ, 36,450 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, ఎంవోపీ 7590 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 4800 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఎరువులను సకాలంలో అందుబాటులో ఉంచడానికి ఇప్పటికే నివేదికలు జిల్లా ఉన్నతస్థాయి అధికారులతో పాటు ప్రభుత్వానికి నివేదించారు. సహకార సంఘాలు, గుర్తింపు పొందిన సంస్థల ద్వారా రైతులకు సీజన్ ప్రారంభానికి ముందు అందుబాటులో ఉంచడానికి కసరత్తు చేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా అంతటా ఎరువులను స్టాక్ ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
వానకాలం సాగు ప్రణాళికను సిద్ధం చేశాం
వానకాలం పంటలకు సంబంధించి సాగు ప్రణాళికలను ఇప్పటికే రూపొందించాం. జిల్లాలో 3.76 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేశాం. ఆయా పంటలకు సంబంధించి విత్తనాలను ఎరువుల కొరత లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో 96.34 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరం ఉండగా, ఎరువులను అందుబాటులో ఉంచుతాం.
– ఆశాకుమారి, జిల్లా వ్యవసాయాధికారి, మెదక్